తెలంగాణాలో పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండ్రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.  రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని పేర్కొన్నారు.

జనవరి ఒకటో తేదీ తర్వాత చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో వైపు హైదరాబాద్‌ శివారులో చలిపులి పంజా విసురుతోంది. ఉదయం పూట బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. చలి తీవ్రత పెరగటంతో చిన్నారుల్లో న్యూమోనియా సహా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉషారాణి తెలిపారు. 

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. ఉత్తరాది నుంచి జోరుగా వీస్తున్న గాలులకు తోడుగా గాలిలో తేమశాతం పెరగడంతో ఉదయం వేళల్లో చాలా గ్రామాల్లో పొగమంచు కమ్ముకుంటున్నది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గవదబిళ్లల సమస్యలతో చిన్నారులు భారీగా ఆసుపత్రుల్లో చేరుతున్నారని చెప్పారు. చలి అధికం కావడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, బీపీ, గుండె సంబంధిత వ్యా ధులు కలిగిన వారు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కాగా, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో  దీంతో పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలను పడిశం పట్టి పీడిస్తున్నది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. వచ్చింది సాధారణ జలుబేనా? కాదా? అనే అనుమానం చాలామందిలో మెదులుతున్నది.  అయితే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వంటివి సాధారణమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
 
హైదరాబాద్‌లోని నిలోఫర్‌ దవాఖానలో సెప్టెంబర్‌, అక్టోబర్‌ సమయంలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో ఇన్‌పేషంట్లుగా చేరే పిల్లల సంఖ్య రోజూ 300-400 వరకు ఉండేదని, ఇప్పుడు 80-100 మధ్య నమోదవుతున్నదని దవాఖాన సూపరింటెండెంట్‌ ఉషారాణి తెలిపారు. ఇప్పుడు జలుబు, దగ్గుతో రోజూ 250 మంది పిల్లలు ఓపీకి వస్తున్నారని, సీజనల్‌ వ్యాధుల సమయంతో పోల్చితే ఇది తక్కువేనని తెలిపారు.