ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు.
 
హైదరాబాద్ బేగంపేట్ లో రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంట్లో ఐపీఎస్ నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఇంటిని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తన పేరుపై బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ కేసులో ఓర్సు సాంబశివరావు, ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్, ఆయన భార్య రూపా డింపుల్‌‌ను నిందితులుగా చేర్చారు. 2014లో జూబ్లిహిల్స్‌‌లో ని తన నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్లు రెంటల్ అగ్రిమెంట్ చేశామని భన్వర్ లాల్ భార్య మనిలాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
2019 లో అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇంటిని ఖాళీ చేయమన్నామని, రెంటల్ అగ్రిమెంట్‌కు విరుద్దంగా నవీన్ కుమార్ అదే ఇంట్లో ఉంటున్నారని ఫిర్యాదు చేశారు. నకీలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారని, తమ ఇంటిని అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నారని భన్వర్ లాల్ సతీమణి ఆరోపించారు.
 
 గత నెల 17 న భన్వర్ లాల్ భార్య మనీలాల్‌ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి చేసి ఓర్సు సాంబశివరావు, రూపా డింపుల్‌ను ఈనెల 22న పోలీసులు అరెస్ట్ చేశారు.