అంగన్వాడీలతో ప్రభుత్వ  చర్చలు విఫలం

గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా  తమ వేతనాల పెంపు కోసం నిరసన, దీక్షలు చేపట్టిన  అంగన్వాడీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మంగళవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.  ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేదే లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి. జీతాల పెంపు సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఒకటోతేదీ నుండి జగనన్న కిట్లు అందించాలని, 5వ తేదీలోపు విధుల్లో చేరకపోతే ప్రభుత్వం ఏమి చేయాలో అది చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. దీనిపై అంగన్‌వాడీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 15 రోజుల నుండి సమ్మె కొనసాగుతుంటే కీలకాంశాలపై చర్చించకుండా బెదిరింపులకు దిగడం ఏమిటని వారు ప్రశ్నించారు.

“ఇప్పటికే గర్భీణులకు పోషకాహారం అందడం లేదు. అంగన్వాడీల సమ్మె వల్ల పిల్లలకు బాలామృతం అందడం లేదు. పోషకాహారం అందకుంటే గర్భిణులు, పిల్లలు ఏమవుతారు..? సమ్మె విరమించకుంటే మేం ప్రత్యామ్నాయాలకు వెళ్లక తప్పదు” అని స్పష్టం చేశారు.  అంగన్వాడీ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగానే ఉందని చెబుతూ వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్ని డిమాండ్లను మేం ఆమోదించామని వెల్లడించారు.

వేతనాల పెంపునకు ఇది సరైన సమయం కాదని,  గ్రాట్యుటీ తమ పరిధిలోకి రాదని అంగన్వాడీలకు వివరించామని తెలిపారు.  సంక్రాంతి తర్వాత మళ్లీ చర్చిద్దామని చెప్పామని, పలు డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చామని చెప్పారు. అయితే, ఈ చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతరాహితంగా వ్యవహరించిందని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి చేయాలని మూడు సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించారు.  కొత్త విషయం ఒకటి కూడా మాట్లాడలేదని పేర్కొంటూ పాత విషయాల్ని చెబుతూ జీతాలు పెంచేటువంటి విషయాన్ని 15 రోజుల తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడతావని చెప్పి చర్చల్ని వాయిదా వేయాలని కోరారని వారు విస్మయం వ్యక్తం చేశారు. 

గత సమావేశం తర్వాత పది రోజులు సమయం తీసుకుని కూడా ఇప్పుడు దాకా ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఒంటరి మహిళలు లక్ష మంది పైగా సమ్మె చేస్తుంటే ఈ విధమైనటువంటి వైఖరి తీసుకోవడం సరైనదికాదంటూ మహిళలపట్ల ప్రభుత్వం వైఖరి దుర్మార్గమైనదని మండిపడ్డారు.