జగన్ పైకి షర్మిల అస్త్రం..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. అధికార వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అందివచ్చే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా పావులు కదుపుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే పొత్తు పెట్టుకోగా.. పురంధేశ్వరి సారధ్యంలోని భారతీయ జనతాపార్టీ సమరానికి సై అంటోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో గెలుపుతో జోష్‌మీదున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ మే సవాల్ అంటోంది. ఒకప్పుడు విపక్షాలపై జగన్ సంధించిన బాణం.. “షర్మిల” అస్త్రాన్ని.. వైసీపీ‌ మీదే ప్రయోగించటానికి సిద్ధం అవుతోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పాలనా పగ్గాల్నే షర్మిల చేతిలో పెట్టటానికి రంగం సిద్ధం అవుతోందన్న వార్తలు.. ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. ప్రస్తుతం ఇప్పడు ఇదే అంశంపై చర్చ సాగుతోంది.
వాస్తవానికి.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీలు చేతులు కలపటంతో.. అధికార వైఎస్సార్ “కాంగ్రెస్” పార్టీ ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ఎన్నికల్లో “కాంగ్రెస్” పార్టీ ఘన విజయం సాధించటం.. ఏపీ సీఎం జగన్ సోదరి మరియు వైఎస్సార్ తెలంగాణ “కాంగ్రెస్” పార్టీ అధ్యక్షురాలు అయిన షర్మిల సైతం.. హస్తం పార్టీతో చేతులు కలపటం కీలకంగా మారింది. వైఎస్సార్ టీపీని టీ.కాంగ్రెస్‌లో విలీనం చేద్దామని భావించిన షర్మిల.. స్థానిక నాయకత్వం అడ్డు చెప్పటంతో వెనుకడుగు వేశారు. అయితే.. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల మూలాలన్నీ ఆంధ్రాలో ఉండటం.. ఆమె కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉండటం, ఆమె ఏపీ సీఎం జగన్ సోదరి కావటంతో కాంగ్రెస్ అధినాయకత్వం.. ముల్లును.. ముల్లుతోనే తీయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
వాస్తవానికి 2009లో వైఎస్సార్ చనిపోయాక.. ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలందర్నీ గంపగుత్తగా తనవైపు తిప్పుకున్నారు. దీంతో 2009 ఎన్నికల్లో 38.56 శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. జగన్ దెబ్బకు 2014 నాటికి 11.71 శాతానికి, 2019 నాటికి 1.17 శాతానికి పడిపోయింది. ఈ నాలుగున్నరేళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఉనికి నామమాత్రంగా కూడా లేకపోయినప్పటికీ.. ఏపీ ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకత, వైఎస్ కుటుంబంలో చెలరేగిన విభేదాలు, వైసీపీలో అసమ్మతి, తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు వంటి పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తు్న్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు జగన్ సంధించిన బాణంగా చెప్పుకున్న సోదరి షర్మిలను తమవైపు తిప్పుకోవటానికి పావులు కదుపుతున్నారు. ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పటం ద్వారా.. గతంలో తాము కోల్పోయిన ఓటు బ్యాంకులో కనీసం 5 శాతాన్నైనా పొందాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీంట్లో భాగంగానే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు అప్పచెప్పటంతో పాటు రాజ్యసభ సీటు ఇచ్చి పార్లమెంట్‌కు సైతం పంపే ఆలోచన ఉన్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీలో దాదాపు 90 శాతం కాంగ్రెస్ రక్తమే ఉండటంతో.. వారిని తిరిగి సొంత గూటికి రప్పించే “ఆపరేషన్ ఆకర్ష” బాధ్యతలను షర్మిలకు అప్పచెప్పనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే కనుక జరిగితే.. అధికార వైసీపీ ఓటు బ్యాంకుకు గండి పడటం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో విపక్ష పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొట్టి రాజకీయంగా లబ్ది పొందిన జగన్‌కు.. ఇప్పుడు తన పార్టీ ఓటు బ్యాంకుకే గండి పడే సూచనలు కనిపించటం సహజంగానే ఆందోళన కలిగించే విషయం. మొత్తం మీద.. ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు.. ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు.. సీఎం జగన్ సీటు కిందకు నీళ్ళు తెచ్చేలా మారుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.