యూఏఈకి రూపాయి మారకంలో చెల్లింపులు

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్‌ తొలిసారిగా యూఏఈ నుంచి కొనుగోలు చేసిన ముడిచమురుకు రూపాయి మారకం ద్వారా చెల్లింపులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూపీ కరెన్సీని ప్రోత్సహించేందుకు భారత్‌ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.  దిగుమతిదారులకు రూపాయిల్లో చెల్లింపులు చేయడానికి, ఎగుమతిదారులు స్థానిక కరెన్సీలో చెల్లింపులను స్వీకరించేందుకు గత ఏడాది జులై 11న ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
రూపాయి మారకంతో చెల్లింపులు చేసేందుకు యూఏఈతో భారత్‌ జులైలో అధికారికంగా ఒప్పందం చేసుకున్నది.  ఆ తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్ఓసి) నుంచి భారతీయ కరెన్సీలో పది లక్షల బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. దానికి సంబంధించి రూపాయి మారకంతో చెల్లింపులు చేసింది. 
 
అలాగే, రష్యా చమురు దిగుమతులకు సైతం భారత్‌ రూపాయి మారకం ద్వారానే చెల్లింపులు చేస్తున్నది. భారత్‌ చమురు అవసరాల్లో 85 శాతానికిపైగా దిగుమతి చేసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  సరిహద్దు చెల్లింపులలో రూపాయి వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో గత మూడేళ్లలో డజనుకుపైగా అంతర్జాతీయ బ్యాంకులకు రూపాయితో వ్యాపారం చేయడానికి అనుమతించింది. 
 
ఆర్‌బీఐ ఇప్పటివరకు 22 దేశాలతో రూపాయితో వ్యాపారం చేసేందుకు అంగీకరించింది. దాంతో భారత కరెన్సీ అంతర్జాతీయ కరెన్సీగా మారనున్నది. దాంతో డాలర్ల డిమాండ్ సైతం తగ్గనున్నది. ఫలితంగా డాలర్‌ పతనమైనా భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. అయితే, చమురు కొనుగోళ్లకు డాలర్లలో చెల్లింపులు చేసే సంప్రదాయం 1970 నుంచి కొనసాగుతున్నది.