భాగ్యనగరానికి దక్కిన భాగ్యమిది..!!

అయోధ్య భవ్యరామమందిరం మరికొన్ని రోజుల్లోనే భక్తకోటిని పునీతం చేయనుంది. ఇప్పటికే నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఆలయం.. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అయితే రామమందిరం నిర్మాణంలో యావత్ దేశం నుంచి ఎందరో మహానుభావులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగా ఆలయం ద్వారాలు.. మన భాగ్యనగరంలో ముస్తాబవుతున్నాయి.
హైదరాబాద్ బోయిన్ పల్లి అనురాధ టింబర్ డిపోలో.. అయోధ్య రామమందిరంలో ఉపయోగించే ద్వారాలు, తలుపులు.. రూపుదిద్దుకుంటున్నాయి. మొత్తం 18 ప్రధాన ద్వారాలతో పాటు.. మరో 100 తలుపులను తయారుచేస్తున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఈ పనులు మొదలైనట్లు.. నిర్వాహకులు తెలిపారు. ఈ ద్వారాలన్నింటిపై బంగారుపూత పూస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం తమిళనాడు నుంచి ప్రత్యేక కళాకారులను రప్పించారు. నిపుణులైన కుమారస్వామి, రమేష్ తో పాటు 60 మంది కళాకారుల బృందం.. ద్వారాల తయారీకోసం రేయింభవళ్లు శ్రమిస్తున్నారు. ద్వారాల తయారీ కోసం బలార్షా నుంచి నాణ్యమైన టేకు కలపను ఉపయోగిస్తున్నారు. ద్వారాల పనులు దాదాపు పూర్తికావొచ్చాయని.. నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రధానద్వారంతో పాటు.. ఆలయంలో ఉపయోగించే మిగతా తలుపుల తయారీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అనురాధ ఇంటర్నేషనల్ టింబర్ డిపో నిర్వాహకులు వెల్లడించారు. తమకు యాదాద్రి ఆలయం ద్వారాలు తయారుచేసిన అనుభవం ఉందని.. దాన్ని పరిగణలోకి తీసుకునే అయోధ్య రామమందిరం నిర్వాహకులు తమకు ఈ ఆర్డర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. రామమందిరం ప్రారంభం కోసం ఏర్పాట్లు మొదలవ్వగానే.. ద్వారాలను తయారుచేసేందుకు ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించారని చెప్పారు. గత ఏడాది నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలకు ప్రతిష్టాత్మక ఎల్ అండ్ టీ కంపెనీ, టాటా ఇన్ఫ్రాస్టక్చర్ వంటి సంస్థలు పోటీ పడగా.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ద్వారాల నిర్మాణంలో తమ ప్రతిభను చూసిన అయోధ్య నిర్వాహకులు.. తమకే ఈ పనులు అప్పగించినట్లు అనురాధ టింబర్ డిపో తెలిపింది. తమ కళాత్మక నైపుణ్యాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ కూడా కొనియాడినట్లు చెబుతున్నారు. అయోధ్య ఆలయ నిర్మాణంలో తమవంతు పాత్ర ఉండటం.. గర్వంగా ఉందని అంతకుమించిన అదృష్టం ఇదీ అంటూ ఉప్పొంగిపోతున్నారు.
మరోవైపు.. భాగ్యనగరంలో అయోధ్య రామాలయం ద్వారాలు తయారౌతున్న విషయం తెలుసుకున్న భక్తులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చారిత్రాత్మక శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో భాగ్యనగర ప్రాతినిధ్యం కూడా ఉండటాన్ని తలచుకుని పొంగిపోతున్నారు. రామమందిర ప్రారంభోత్సవ ఘడియలు ఎప్పుడు సమీపిస్తాయా..? అనుకుంటూ.. శ్రీరాముని దివ్య దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.