డీఎంకే నేతలు మరీ ఇంతలా దిగజారిపోవాలా..?

ఓ వైపు తమిళనాడు వరదల్లో కొట్టుకుపోతోంది. ఎన్నడూ లేని విధంగా జిల్లాలకు జిల్లాలే ముంపులో మునిగిపోతున్నాయి. రాజధాని చెన్నైలో మాత్రం ఎక్కడ చూసినా తుపాను కష్టాలే. కనివినీ ఎరుగని రీతిలో లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆదుకునేవారు కరువయ్యి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది వర్షపాతం ఒక్క రోజులోనే వచ్చిందని సాక్ష్యాత్తు అక్కడి సర్కారే ప్రకటించింది. అయితే అధికార యంత్రాంగం సహాయకచర్యల్లో మునిగిపోతే.. అధికార పార్టీ నాయకులు మాత్రం.. తమ వైఖరి మార్చుకోవడం లేదు. మళ్లీ సనాతన ధర్మ నిర్మూలన అనే పాత పాట పాడుతున్నారు. ప్రజల్లో ద్వేష రాజకీయాలను పెంచిపోషిస్తున్నారు. ద్రవిడ వాదాన్ని నూరిపోస్తున్నారు.

తాజాగా డీఎంకే లీడర్, ఎంపీ దయానిధి మారన్ హిందీభాషపై, దాన్ని మాట్లాడేవారిని అత్యంత కించపర్చేలా వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్, బిహార్ కు చెందిన హిందీ భాష మాట్లాడేవారు.. తమిళనాడులో టాయ్‌లెట్లు క్లీన్ చేస్తున్నారని ఓ సభలో మాట్లాడారు. రోడ్లు శుభ్రం చేస్తున్నారని, నిర్మాణపనుల్లో ఉన్నారంటూ అగౌరవపర్చేలా వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మాట్లాడే తమిళిలు.. సాఫ్ట్ వేర్ జాబ్ లు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడితే.. హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని మాట్లాడారు. దయానిధి మారన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు. ఇండి కూటమి దీనికేం సమాధానం చెబుతుందని.. ప్రశ్నిస్తున్నారు.

“దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండి కూటమి ప్రయత్నిస్తోంది. ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరం. మొదట రాహుల్ గాంధీ ఉత్తర భారత ఓటర్లను అవమానించారు. కొందరు బీహార్ డీఎన్ఏను దుర్భాషలాడారు. అప్పుడు డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ “గోమూత్ర రాష్ట్రాలు” అన్నారు. ఇప్పుడు దయానిధి మారన్ హిందీ మాట్లాడేవారిని, ఉత్తరాది వారిని అవమానించారు. సనాతన ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, ఆపై విభజించి రూల్ కార్డ్ ప్లే చేయడం ఇండి కూటమి యొక్క డీఎన్‌ఏ. నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, లాలూ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించరా..? వారు ఎప్పుడు స్టాండ్ తీసుకుంటారు..? అంటూ బీజేపీ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించింది. ఇటు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. బీహార్ ప్రజలు ఎక్కడికి వెళ్లినా కష్టపడి పనిచేస్తారన.. ఆత్మగౌరవంతో పనిచేయడం నేరం కాదన్నారు.

హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై డీఎంకే నేతలు గత కొన్ని నెలలుగా తీవ్రమైన దాడి చేస్తున్నారు. సనాతనధర్మాన్ని నయం కాని వ్యాధులతో పోల్చి.. దాన్ని నిర్మూలించాలని మంత్రి, సీఎం కుమారుడు ఉదయనిధి మారన్ చేసిన వ్యాఖ్యలు ఎంతలా వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. ఆ తర్వాత అవే వ్యాఖ్యలను రిపీట్ చేస్తూ.. ఇతర డీఎంకే నేతలు నోటికి పనిచెప్పారు. మొన్నటికి మొన్న మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని జీర్ణించుకోలేని డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్.. ఏకంగా ఉత్తరాది రాష్ట్రాలపై చేసిన పదప్రయోగం తీవ్ర వివాదాస్పదమయ్యింది. ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలుగా ఆయన అభివర్ణించారు. అందుకే అక్కడ బీజేపీ గెలుస్తుందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ మాటల మంటలు చల్లారకుండానే.. జమ్మూకశ్మీర్ అంశంపై పెరియార్ వేర్పాటువాద సూక్తులు ప్రబోధించి మరో డీఎంకే మంత్రి అబ్దుల్లా.. ఉపరాష్ట్రపతి చేత మొట్టికాయలు తిన్నారు. అయినా ఆ పార్టీ నేతల వైఖరి మాత్రం మారడం లేదు.

అయితే మారన్ వ్యాఖ్యలను బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ ఖండించారు. ఏ పార్టీకి చెందిన వారైనా.. ఏ రాష్ట్రాలకు చెందిన నేతలైనా.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని.. ఈ దేశం ఒక్కటే అని.. ఇతర రాష్ట్రాల వారిని గౌరవించాలని సూచించారు. అయితే మారన్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో పాతదని.. డీఎంకే చెబుతోంది. బీజేపీ కావాలనే పాత వీడియోను బయటకు తీసిందని.. ఆరోపించింది. ఏదేమైనా.. తమిళనాడులో అన్నామలై పాదయాత్రతో బీజేపీ బలపడిందనేది ఎవరూ కాదనలేని సత్యం. అయితే తమిళ ప్రజలు బీజేపీ వైపు వెళ్లకుండా.. మళ్లీ వారిలో ద్రవిడ వాదాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతోనే డీఎంకే నేతలు ఇంతటి ప్రయాస పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంతలా దిగజారి మాట్లాడటాన్ని తప్పుబడుతున్నారు.