
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడం పెద్ద దుమారం రేపడంతో కొత్తగా ఎన్నికైన రెజ్లింగ్ సమాఖ్యను ఆదివారం భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. దాంతో, రెజ్లర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ నేరుగా బరిలో నిలకపోయినా 15 పదవుల్లో తన వర్గానికి చెందిన 13 మందిని గెలిపించుకున్నాడు.
ఈ క్రమంలో బ్రిజ్ భూషణ్ ప్రధాన అనుచరుడిగా పేరొందిన, ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్‌పై 40-7 ఓట్ల తేడాతో గెలిచి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు.
అయితే, డబ్ల్యూఎఫ్‌ఐలో బ్రిజ్ భూషణ్ వర్గం ఎన్నికకావడాన్ని నిరసిస్తూ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తాను ఇక కుస్తీని వదిలేస్తున్నానని కన్నీటి పర్యంతమైంది. ఒలింపిక్ విజేత భజ్‌రంగ్ పూనియా తన పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేశాడు. మరో రెజ్లర్ వీరేందర్ సింగ్ తన పద్మ శ్రీ అవార్డును వదులుకునేందుకు సిద్ధమయ్యాడు.
సాక్షి మాలిక్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంఘీభావం ప్రకటించింది. దాంతో, దేశవ్యాప్తంగా రెజ్లర్లకు మద్దతు పెరగడం గమనించిన క్రీడాశాఖ సంజయ్ సింగ్ బృందాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మరోవంక, ఎన్నికల్లో గెలిచిన అనంతరం క్రీడా శాఖను సంప్రదించకుండానే సంజయ్ జాతీయ స్థాయి అండర్ -15, అండర్-20 రెజ్లింగ్ పోటీలు ఉత్తర్ ప్రదేశ్ గోండాలోని నందిని నగర్‌లో నేషనల్స్ జరుగుతాయని ప్రకటించారు. ఈ ప్రకటనను తొందరు పాటు చర్యగా అభివర్ణించిన క్రీడల శాఖ రెజ్లర్లకు తగిన నోటీసు ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయంగా ప్రకటించింది. ఈ క్రీడల్లో పాల్గొనే రెజ్లర్లకు ముందుగా సమాచారం ఇవ్వకుండానే ఇలాంటి ప్రకటన చేయడం డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగానికి విరుద్ధం.
‘కొత్తగా ఏర్పాటు చేసిన డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ పూర్తిగా మాజీ ఆఫీస్ బేరర్ల అధీనంలో ఉన్నట్టు, స్పోర్ట్స్ కోడ్‌ను పూర్తిగా ఉల్లంఘించినట్టు కనిపిస్తోంది’’ అని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మాజీ ఆఫీస్ బేరర్ల అధీనంలో రెజ్లింగ్ సమాఖ్య కార్యకలాపాలు నడుస్తున్నట్టు భావించాల్సి వస్తోందని, గతంలో క్రీడాకారుపై లైంగిక వైధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల అంశం ప్రస్తుతం కోర్టు విచారణ ముందు ఉందని తెలిపింది.
దాంతో సంజయ్ జాతీయ క్రీడా నిబంధనలను ఉల్లంఘించారని అతడి బృందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు తదుపరి ప్రకటన వెల్లడించేంత వరకూ సస్పెన్షన్ కొనసాగతుందని తెలిపింది. కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను భారత క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేయడాన్ని రెజ్లర్లు స్వాగతిస్తున్నారు.
‘మేము రాజకీయ పావులుగా మారామని, హర్యానా.. ఉత్తరప్రదేశ్ ఇలా ప్రాంతాల వారీగా విడిపోయామని కొందరు విమర్శిస్తున్నారు. మేము దేశం కోసం రక్తం, చెమటను చిందించాం. కానీ, బ్రిజ్ భూషణ్ అనుచరులు మమ్మల్ని దేశ ద్రోహులు పిలుస్తున్నారు. అసలు వాళ్లెవరూ మమ్మల్ని, మా దేశ భక్తిని శంకించడానికి. అప్పుడు, ఇప్పుడు మా నిర్ణయం ఒక్కటే. బ్రిజ్ భూషణ్ బృందం భారత రెజ్లింగ్ సమాఖ్యకు దూరంగా ఉండాలి’ అని భజ్‌రంగ్ తెలిపారు.
More Stories
భారత్ లో ఓటింగ్ను పెంచేందుకు అమెరికా నిధులు?
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత