మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న రిటైర్డ్‌ పోలీస్‌పై కాల్పులు

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఆర్మీ వాహనాలపై దాడి చేశారు. తాజాగా బారాముల్లాలోని మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న రిటైర్డ్‌ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అజాన్‌ సందర్భంగా మసీదులో మహ్మద్‌ షఫీపై కాల్పులు జరుపడంతో మృతి చెందారని పోలీసులు తెలిపారు. 
 
ఆ తర్వాత సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బారాముల్లాలోని గంట్ముల్లాలో రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ మసీదులో అజాన్ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారని కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా తెలిపారు. 
 
ఇటీవల లోయలో పోలీసులు, బలగాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుల్వామాతో పాటు జమ్మూకశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. శ్రీనగర్‌లోని అన్ని ప్రధాన కూడళ్లలో పాటు ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద మొబైల్ వాహన తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
 
ఇలా ఉండగా, జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో గురువారం ఉగ్ర దాడి జరిగిన ప్రాంతంలో శుక్రవారం ముగ్గురు పౌరులు శవాలై కనిపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని శనివారం ప్రకటించింది. ఉగ్ర దాడి గురించి ఆర్మీ ప్రశ్నించిన ఎనిమిది మందిలో మరణించిన ముగ్గురు పౌరులు ఉన్నారు.
 
వీరంతా తోపా పీర్‌ గ్రామానికి చెందినవారు. పౌరుల మరణంపై రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశాయి. ఆర్మీ మొత్తం 15 మందిని ప్రశ్నించిందని, అందులో ముగ్గురు చనిపోగా మిగతా వారంతా తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారని పీడీపీ అధ్యక్షురాలు ముఫ్తీ తెలిపారు.  అంతర్జాతీయ సరిహద్దు వద్ద శనివారం ఉగ్రవాదులు చేసిన చొరబాటు యత్నాన్ని భారత సైన్యం సమర్థంగా తిపి కొట్టింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
 
చొరబాటుకు పాక్ సైన్యం సహకారం
 
మరోవంక, జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటుకు  పాకిస్థాన్‌ ఆర్మీ సహకరించింది. దీని కోసం సొంత ఆర్మీ పోస్ట్‌ను దగ్ధం చేసిందని భారత ఆర్మీ వెల్లడించింది. శుక్రవారం రాత్రి జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు నలుగురు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీనికి పాకిస్థాన్‌ ఆర్మీ సహాయం చేసింది.  భారత్ వైపు ఉన్న నిఘా పరికరాల దృష్టిని మరల్చేందుకు సైనిక పోస్టుల్లో ఒక దానికి నిప్పుపెట్టింది. అయితే ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత ఆర్మీ భగ్నం చేసింది. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఇద్దరు పాకిస్థాన్‌ వైపు పారిపోయారు.
 
కాగా, ఇండియన్ ఆర్మీ 16 కార్ప్స్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇండో, పాక్‌ సరిహద్దులోని అఖ్నూర్ సెక్టార్‌లో శుక్రవారం రాత్రి నలుగురు ఉగ్రవాదుల కదలికలను నిఘా పరికరాల ద్వారా గమనించినట్లు తెలిపింది. కాల్పులు జరుపడంతో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని, ఒకరి మృతదేహాన్ని వెనక్కి లాగడం కనిపించినట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.  ఇటీవల కాలంలో నియంత్రణ రేఖతో పాటు, అంతర్జాతీయ సరిహద్దులో కూడా ఉగ్రవాదుల చొరబాట్లను పాకిస్థాన్‌ ఆర్మీ ప్రేరేపిస్తున్నట్లు భారత ఆర్మీ ఆరోపించింది.