టిడిపితో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ విముఖత!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికలలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేశ్‌ తో కలిసి కనిపించడం,  అనంతరం వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం జరిగింది. హైదరాబాద్ నుండి స్వయంగా లోకేష్ ఆయన తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు.

ప్రశాంత్‌ కిషోర్‌తోపాటు షో టైమ్‌ కన్సల్టెన్సీ పేరిట టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్‌ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు. చంద్రబాబు, ప్రశాంత్‌ కిషోర్‌ల మధ్య దాదాపు 3గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే, తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడానికి ప్రశాంత్ కిశోర్ అంగీకరించలేదని చెబుతున్నారు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సిన దశలో ఇప్పుడు తానేమీ చేయలేనని కుండబద్దలు కొట్టారని సమాచారం. జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందని, దీన్ని సరిదిద్దుకోవడానికి చాలినంత సమయం ఇప్పుడు లేదని ఆయన చంద్రబాబుకు తేల్చి చెప్పారని తెలుస్తోంది.

సమావేశం ముగిసిన అనంతరం బయటికి వచ్చిన ప్రశాంత్ కిశోర్ చంద్రబాబు నివాసం వద్ద విలేకరులతో మాట్లాడటానికి నిరాకరించారు. ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే కారులో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద తనను కలిసిన విలేకరులతో క్లుప్తంగా మాట్లాడారు.  చంద్రబాబును తాను మర్యాదపూరకంగా మాత్రమే కలిశానని, ఇందులో రాజకీయాల ప్రస్తావన రాలేదని అన్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు కావడం వల్ల పిలిచిన వెంటనే వచ్చానని, ఇది మర్యాదపూరక భేటీ మాత్రమేనని చెప్పారు.

“చంద్రబాబు సీనియర్‌ నేత. అందుకే మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు వచ్చా. దీనిపై ఎలాంటి ఊహాగానాలు వద్దు” అంటూ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు పెట్టిన కొన్ని ప్రతిపాదనలపై ప్రశాంత్ కిశోర్ విముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ద్వారా 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అధికారం చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఆయన ఐప్యాక్ కు దూరంగా ఉంటున్నారు. చివరిగా ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ కోసం పనిచేశారు. ఈ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ విజయం సాధించింది. 

ఆ తర్వాత కొంత కాలం బీఆర్ఎస్ కు పనిచేసినట్లు వార్తలు వచ్చినా వారి మధ్య అవగాహన కుదరలేదు. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ ఏపీకి రావడం, చంద్రబాబుతో భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ ముందు, ఆ తర్వాత కూడా హైదరాబాద్ లో కలిసిన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు జైలులో ఉండగా లోకేష్ ఢిల్లీలో ఆయనను కలిసినట్టు తెలుస్తున్నది.

ఇటీవల పలు టీవీ డిబెట్లలో ప్రశాంత్ కిషోర్ ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలా అప్పులు చేసి పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కోసం పనిచేసి గెలిపించినందుకు తనను ఇప్పుడు విమర్శిస్తున్నారని కూడా ఓ టీవీ డిబెట్ లో ఉన్నారు. జగన్‌ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో చదన్రాబాబుకు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఆయా వర్గాలు, అంశాల వారీగా ప్రభుత్వ బలాబలాలను పీకే వివరించినట్లు తెలుస్తోంది.

”వైసిపి ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యుత్‌ బిల్లులు, పన్నుల బాదుడు వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. దళితులు, బీసీలపై దాష్టీకాలు ఆయా వర్గాలను వైకాపాకు దూరం చేశాయి. ఒకరిద్దరు మినహా.. కేబినెట్‌ మంత్రులకు సున్నా మార్కులు” అంటూ పీకే వ్యాఖ్యానించినట్టు టిడిపి  వర్గాలు లీక్ ఇచ్చాయి.
 
ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని, దానికి అనుగుణంగా ప్రతిపక్షం వ్యూహరచన ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని, చంద్రబాబు అరెస్టుతో తటస్థులతో పాటు కొంత మేర వైసిపి వర్గాల్లోనూ జగన్‌పై వ్యతిరేకత వచ్చిందని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.