తిరుమలలో నేత్రపర్వంగా స్వర్ణ రథోత్సవం

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ‌నివారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో లాగారు. 
 
స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. తిరువీధులన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఈ సంద‌ర్భంగా గోవింద‌నామ‌స్మ‌ర‌ణ‌తో తీరుమల వీధులు మార్మోగాయి.  వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఆదివారం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. 
 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం వేకువజాము నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి 12గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు ధనుర్మాస కైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. 1.30 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించారు. 
 
ఉదయం 5.15 గంటల వరకు వీఐపీలకు దర్శనం కల్పించిన తర్వాత సర్వదర్శన భక్తులను అనుమతించారు. స్లాట్ల వారీగా అర్ధరాత్రి వరకు వైకుంఠద్వార దర్శనాలను కల్పించారు.  శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ల‌క్ష‌లాది భ‌క్తుల‌తో పాటు పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు.  ఇక వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం 10 రోజుల పాటు టిటిడి క‌ల్పించింది. తొలి రోజైన నేడు స్వామి ద‌ర్శ‌నాన్నికి కొండ‌పైకి ల‌క్ష‌కు పైగా భ‌క్తులు చేరుకున్నారు.. ముందుగా ద‌ర్శ‌న టోకెన్లు తీసుకున్న వారికి మాత్ర‌మే ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు.. క్యూ కాంప్లెక్ట్ లు నిండిపోగా, బ‌స్టాండ్ వ‌ర‌కూ భ‌క్తులు క్యూలైన్ లో ఉన్నారు.
 
కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా అశేష భక్త జనం మధ్య తిరుమలేశుడు స్వర్ణరథంపై తిరుమల మాడవీధుల్లో విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తులు సంతృప్తిక‌రంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్నార‌ని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశామ‌ని టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తెలిపారు.