నెలలో ప్రపంచవ్యాప్తంగా 52 శాతం పెరిగిన కరోనా కేసులు

మొన్నటి వరకు ఉపశమనం కల్పించిన కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కేసుల సంఖ్య భారీగా విపరీతంగా పెరుగుతున్నది. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8.50లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 
 
మహమ్మారి కారణంగా 3వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 17 వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 77 కోట్లు దాటగా, వైరస్‌ కారణంగా 70లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 1.18లక్షల మంది రోగులు ఆసుపత్రుల్లో చేరారు.  ఇందులో 1600 మందికిపైగా రోగుల పరిస్థితి విషమంగా ఉందని ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్య 23 శాతం పెరిగిందని, ఐసీయూలో చేరిన రోగుల సంఖ్య 51 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.  ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు సైతం వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వేరియంట్‌తో పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ చలి పెరుగుతున్న కొద్ది పలు దేశాల్లో శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం సైతం పెరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లతో దీన్ని ఎదుర్కోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కరోనాతో పాటు శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫ్లుఎంజా,  ఆర్‌ఎస్‌వీ, న్యుమోనియా తదితర వ్యాధులు సైతం భారీగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లే సమయంలో మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏడు నెలల గరిష్ఠానికి కరోనా కేసులు

మరోవంక, దేశంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 752 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల నలుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3,420 యాక్టివ్‌ కేసులుండగా, కేరళలో ఈ తరహా కేసుల సంఖ్య 2 వేలు దాటింది.  కొత్తగా నలుగురు మరణించడంతో మరణాల సంఖ్య 5,33,332కు పెరిగింది.

కొత్త కేసులు న్యూఢిల్లీ, గోవా, గుజరాత్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణలో నమోదయ్యాయి. క్రిస్‌మస్‌ పండగ తరుణంలో దేశంలో జేఎన్‌.1 వేరియంట్‌ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డానికి కొత్త వేరియంట్ జేఎన్‌.1 కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.