మరోసారి కరోనా కలకలం మొదలైంది. దేశంలో కొత్త కరోనా వెలుగులోకి రావటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు బయట పడుతున్నాయి. దీంతో, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాల రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదైంది. 85 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ కు అధికారులు పంపించారు. ఏలూరులో మరో కరోనా కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ర్యాండమ్ చేసిన వైద్యులు ఓ ప్రయివేటు మెడికల్ కాలేజ్ వైద్యుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు.
వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్ ను హైదరాబాద్ లోని జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు ఎక్కడకు వెళ్లి రాలేదని అధికారులు వెల్లడించారు. ఏపీలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా టెస్టులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
కరోనా కొత్త వేరియంట్ జెఎన్ 1 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఈ వేరియంట్ సోకినవారు కోలుకుంటున్నారని ముఖ్యమంత్రికి అధికారులు తీసుకెళ్లారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు జేఎన్ 1కు లేవని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,741 ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రికి వివరించారు.
ఇటు హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు కరోనా బారిన పడ్డారు. నాలుగైదు రోజులుగా తీవ్రమైన జర్వం, ఊపిరి పీల్చుకోవటంలో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.14 నెలల చిన్నారికి కరోనా సోకింది, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తితో ఎంజీఎం సిబ్బంది అప్రమత్తయ్యారు. మాస్క్ లేనిదే ఆసుపత్రిలోకి అనుమతించటం లేదు. కరోనా రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఇప్పటి వరకు తెలంగాణాలో 20 కేసులు నమోదయ్యాయి. 16 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా నుంచి ఒకరు రికవరీ కాగా, 19 మందికి చికిత్స కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన కేసుల్లో హైదరాబాద్‌లో నాలుగు, మెదక్‌లో ఒకటి, రంగారెడ్డిలో ఒక కరోనా కేసు నమోదైంది. ఇప్పటివరకు 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో సోషల్ డిస్టన్స్, మాస్క్ వినియోగం పైన నిఫుణలు సూచనలు చేస్తున్నారు.
కరోనా పెరుగుదల దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాస్కులు ధరించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మా రాష్ట్ర ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన రాష్ట్ర సచివాలయంలో వైద్య విధాన పరిషత్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే అక్కడక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి కరోనా సన్నద్ధతపై వివరించినట్లు చెప్పారు. అన్ని ఆసుపత్రుల్లో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
పండగల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గుంపులోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ప్రభుత్వం మాస్క్ నీ తప్పని సరి చేసినా చెయ్యక పోయినా ప్రతి ఒక్కరూ గుంపుల్లోకి వెళితే మాస్క్ ని బాధ్యతగా ధరించాలని సూచించారు. ఓమిక్రన్ వేరియంట్ కి సబ్ వేరియంట్ జెఎన్.1 కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని, వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటుందంటూ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు