`ఇండియా’ కూటమిలో ఎవ్వరి దారి వారిదేనా!

 
* డీఎంకే నేతపై నితీశ్‌ అసహనం * బీఎస్‌పీతో కాంగ్రెస్ మంతనాలు
 
మూడున్నర నెలల విరామం అనంతరం గత మంగళవారం జరిగిన `ఇండియా’ కూటమి సమావేశంలో ఎవ్వరి దారి వారిదిగానే కనిపిస్తున్నది. ఈ నెలాఖరు లోగా సీట్ల సర్దుబాటు పూర్తి కావాలని నిర్ణయించినప్పటికీ పరస్పరం నిందారోపణలు యధావిధిగా కొనసాగాయి.  హిందీ ప్రసంగంకు అనువాదం కోరిన డీఎంకే నేత, మాజీ కేంద్ర మంత్రి టి ఆర్ బాలుపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. మరోవంక, ఉత్తర ప్రదేశ్ లో బీఎస్‌పీతో కాంగ్రెస్ నేతలు లోపాయికారి మంతనాలు జరుపుతున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జాతీయ భాష అయిన హిందీ తెలిసి ఉండాలని అంటూ  టి ఆర్ బాలుపై నితీష్ హితవు చెప్పారు.  కూటమి సమావేశంలో నితీశ్‌ కుమార్‌  హిందీ ప్రసంగాన్ని డీఎంకే నేత టీఆర్‌ బాలు అర్ధం చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో దానిని అనువాదం చేయాలని ఎదురుగా కూర్చొన్న ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝాకు సైగ చేశారు.

దానితో, హిందీ ప్రసంగాన్ని అనువదించేందుకు నితీశ్‌ కుమార్ అనుమతిని మనోజ్‌ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తాం. హిందీని మన జాతీయ భాష అని వ్యవహరిస్తాం. మనకు ఆ భాష తెలిసి ఉండాలి’ అని నితీశ్‌  కరకుగా సమాధానం చెప్పారు.  అలాగే తన హిందీ ప్రసంగాన్ని అనువదించవద్దని మనోజ్‌కు స్పష్టం చేశారు. మరోవైపు హిందీని తీవ్రంగా వ్యతిరేకించే డీఎంకే చీఫ్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా ఆ పార్టీ ఎంపీ టీఆర్‌ బాలుతో కలిసి ‘ఇండియా’ బ్లాక్‌  సమావేశంలో పాల్గొన్నారు.

 మరోవంక, ఉత్తరప్రదేశ్‌లో పొత్తుల విషయంలో బహుజన్ సమాజ్‌ పార్టీని దూరంగా పెట్టాలని ఇండియా కూటమి నాలుగో సమావేశంలో కాంగ్రెస్‌ను అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ కోరినట్టు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. 

అయితే కూటమిలో బీఎస్‌పీ ఉండకూడదని కాంగ్రెస్ నేతలకు సమాజ్‌వాదీ పార్టీ నాయకులు తెగేసి చెప్పారు. బీఎస్‌పీతో చర్చలు జరపాలనుకుంటున్నారా? వారితో టచ్‌లో ఉన్నారా? అని నేరుగా ప్రశ్నించారు. దానితో, అలాంటిదేమీ లేదని, యూపీలో సమాజ్‌వాదీ, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎస్పీ నాయకులకు భరోసా ఇచ్చారు.