పార్లమెంట్ నుండి 79 మంది సభ్యుల సస్పెన్షన్

79 మంది ప్రతిపక్ష సభ్యులపై  సోమవారం ఒక్కరోజే  పార్లమెంట్ నుండి సోమవారం సస్పెన్షన్  వేటు పడింది.  పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 

దీంతో లోక్‌సభ నుంచి 33 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్‌ ఓం బిర్లా సస్పెండ్‌ చేశారు.  రాజ్యసభలో నుంచి 46 మంది ఎంపీలను చైర్మన్‌ జగ్‌దీప్‌ ధంకర్‌ సస్పెండ్‌ చేశారు. శీతాకాల సమావేశాల వరకు ఈ సస్పెన్షన్‌ విధించారు. గతవారం 14 మంది ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.  దీంతో మొత్తం 93 మంది సస్పెండ్‌కు గురయ్యారు.

సభలో గందరగోళం సృష్టించినందుకు కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి సహా 34 మంది ప్రతిపక్ష సభ్యులను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ అయ్యారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ కొనసాగనున్నది. సస్పెండ్ అయిన ఎంపీల్లో అధిర్ రంజన్ చౌదరి, టీఆర్ బాలు, దయా నిధి మారన్ ఉన్నారు.  మాణికం ఠాగూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకందన్, బెన్నీ బహనన్, కే సుబ్రమణ్యం, ఎస్ వెంకటేశన్, మహ్మద్ జావేద్ ఉన్నారు.

30 మంది ఎంపీలను శీతాకాల సమావేశాల వరకు సస్పెన్షన్‌ విధించగా, మరో ముగ్గురిని ప్రివిలేజెస్‌ కమిటీ నివేదిక ఇచ్చే వరకు సస్పెండ్‌ చేశారు.  కే జయకుమార్‌, విజయ్‌ వసంత్‌, అబ్దుల్‌ ఖలీక్‌ ముగ్గురు స్పీకర్‌ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో ప్రవేశపెట్టారు.
 
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తుండడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగడంతో స్తంభించి పోతున్నాయి. ఈ క్రమంలో పలుసార్లు రాజ్యసభను చైర్మన్‌ వాయిదా వేశారు. సభ్యులను సర్ది చెప్పినా వినకపోవడంతో సభ నుంచి సస్పెండ్‌ చేశారు.
 
భద్రతా వైఫల్యంపై రాజకీయం చేయడం శోచనీయమని స్పీకర్‌ ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారు. వెల్‌లోకి వచ్చి నినదించడం సభా మర్యాదలకు విరుద్ధమని హితవు చెప్పారు. కీల‌క‌మైన అంశాల‌పై చ‌ర్చ చేప‌ట్టేందుకు ప్రతిపక్షాల స‌హ‌కారం అవ‌స‌రమ‌ని ఓం బిర్లా సూచించారు. ఘటనపై విచార‌ణ జరుగుతుందని, ద‌ర్యాప్తు ఏజెన్సీలు ఆ వ్యవహారాన్ని తేలుస్తాయని భరోసా ఇచ్చారు.