ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ఆధునీకరణపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాగ్వాదానికి దిగారు. వారి నిరసనతో సభ అదుపు తప్పింది. దీంతో మార్షల్స్ సహాయంతో వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపారు.
2020- 22 మధ్య కాలంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం పునరుద్ధరణకు ఆప్ ప్రభుత్వం రూ.189 కోట్లు ఖర్చు చేసిందని బీజేపీ ఆరోపించింది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దీనిపై చర్చ జరుగాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాంవీర్ సింగ్ బిధూరి నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు.
స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ వారి డిమాండ్‌ను తిరస్కరించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన తెలిపారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, ఢిల్లీ జల్ బోర్డ్, హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు స్పీకర్ అనుమతించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు తమ నిరసన వీడలేదు. కేజ్రీవాల్ అధికార నివాసం పునరుద్ధరణలో భారీ అవినీతి చోటుచేసుకుందంటూ ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాంవీర్ సింగ్ బిధూరితో సహా బీజేపీ ఎమ్మెల్యేలు అభయ్ వర్మ, అజయ్ మహావార్, మోహన్ సింగ్ బిష్త్, అనిల్ కుమార్ బాజ్‌పాయ్, విజేందర్ గుప్తా, ఓం ప్రకాష్ శర్మ, జితేందర్ మహాజన్‌ను అసెంబ్లీ నుంచి బయటకు పంపాలని స్పీకర్ గోయల్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మార్షల్స్ వారిని బయటకు తరలించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ‘గలీ గలీ మే షోర్ హై, అరవింద్ కేజ్రీవాల్ చోర్ హై’ అంటూ నినాదాలు చేశారు.
కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు!
ఇలా ఉండగా, అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మరోసారి నోటీసులు జారీచేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ కోసం ఈ నెల 21న తమ ముందు హాజరుకావాలని ఈడీ తన నోటీసులలో పేర్కొన్నది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపడం ఇది రెండోసారి. ఈడీ ఇంతకు ముందు నవంబర్ 2న సమన్లు పంపగా, ఈడీ సమన్లు చట్టవిరుద్ధమంటూ ఈడీ ముందు హాజర్యయేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు.
కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్ ఈ కేసులో అరెస్టయ్యారు. గత ఏప్రిల్ 16న ఈ కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది.
షెడ్యూల్ ప్రకారం ఈ వారంలో 10 రోజుల విపాసన మెడిటేషన్ కోర్సుకు అజ్ఞాత ప్రాంతానికి వెళ్లాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఢిల్లీ శీతాకాల సమావేశాలు పూర్తయిన మరుసటి రోజే.. డిసెంబర్ 19న ఆయన ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఏడాది కేజ్రీవాల్ డిసెంబర్ 19 నుంచి 30 వరకూ విసాసన కోర్సుకు వెళ్తుంటారని అధికారులు చెబుతున్నారు.
More Stories
అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్
దేశ ఐక్యతకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్