గత వారం లోక్ సభలో విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకి కలర్ స్మోక్ (రంగు పొగ) ప్రయోగించిన ఘటనను భద్రతా వైఫల్యంగా పరిగణించకూడదని, అది మానవ తప్పిదం, పొరపాటు కారణంగా సంభవించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సందర్శకులుగా వచ్చేవారి మనసులో ఏముందో ఎవరికైనా ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు.
సోమవారం పార్లమెంటులో విపక్ష సభ్యుల సస్పెన్షన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 13 నాటి ఘటనలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే సెక్యూరిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్టు కనిపించిందని, చివరకు సందర్శకుల జేబులో ఉన్న పెన్ కూడా తీసుకుని పక్కనపెట్టారని ఆయన తెలిపారు.
అయితే అప్పటి వరకు కాలికి వేసుకున్న బూట్లను విప్పి తనిఖీ చేయడం ఎప్పుడూ జరగలేదని, కానీ ఈ ఘటన తర్వాత ఇక నుంచి బూట్లను కూడా తనిఖీ చేసే పరిస్థితి కల్పించారని ఆయన చెప్పారు. విజిటర్స్ గ్యాలరీ కొత్త పార్లమెంట్‌లోనే కాదు, పాత పార్లమెంట్ భవనంలోనూ ఉందని, విజిటర్స్ అప్పుడూ వచ్చారు, ఇప్పుడూ వస్తున్నారని తెలిపారు.
వచ్చే అందరినీ సెక్యూరిటీ సిబ్బంది మూడుసార్లు తనిఖీ చేస్తారని చెబుతూ ఈ ఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని కొత్త పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఇప్పటికే చాలామందిని అరెస్టు చేశామని, పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బందిలో 8 మందిని సస్పెండ్ చేశామని గుర్తు చేశారు.
మరోవైపు పార్లమెంటు భద్రత కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని, పార్లమెంట్ ప్రాంగణం పూర్తిగా లోక్‌సభ స్పీకర్ పరిధిలో ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనను శాంతి భద్రతల వైఫల్యంగా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్నాయని పేర్కొంటూ శాంతి భద్రతలకు ఎక్కడ భంగం కలిగిందో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
“జమ్మూ-కాశ్మీర్‌లోకి చొరబడే ఉగ్రవాదులను అడ్డుకోవడంలో భంగం కలిగిందా? మత ఘర్షణలు జరగకుండా నియంత్రించడంలో భంగం కలిగిందా? కర్ఫ్యూలు లేని పాలన అందించడంలో భంగం కలిగిందా?” అంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. తాజా ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్షాలు అభద్రతా భావంతో ఉన్నాయని, కనీసం ఇప్పుడున్న సీట్లైనా మళ్లీ తిరిగొస్తాయా అన్న ఆందోళన వారిలో ఉందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అందుకే గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తప్పులు చేసేవారిని శిక్షించడం కోసం చట్టాలు తయారుచేసే పార్లమెంట్ సభ్యులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని సభా మర్యాదలు కాపాడతామని చెప్పినవారే సభ జరగకుండా అడ్డంకులు కలిగించడం తగదని వ్యాఖ్యానించారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి చేరే సమయంలో అధికార, విపక్షాలకు చెందిన సభ్యులందరూ సభా మర్యాదలు కాపాడాలని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, కానీ ఆ నియమాలను ప్రతిపక్షాలు విస్మరించాయని కిషన్ రెడ్డి విమర్శించారు.
ప్లకార్డ్స్ పట్టుకుని లోపలికి వస్తున్నారని, సోమవారం ఏకంగా స్పీకర్ ఛాంబర్ మీదికి ఎక్కి హంగామా సృష్టించారని మండిపడ్డారు. ఇప్పటికే రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా ప్రజల్లో గౌరవం తగ్గుతోందని, విపక్షాల తీరు చూస్తే ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎ
వరైనా సరే పద్ధతి ప్రకారం తమ నిరసన వ్యక్తం చేయవచ్చని, తద్వారా తాము చెప్పదల్చుకున్నది దేశ ప్రజలకు తెలిసేలా చేయవచ్చని సూచించారు. ఇలా నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరించడం ఏమాత్రం తగదని స్పష్టం చేశారు.
More Stories
ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన మోదీ
ప్రతినిధుల సభకు ఆరుగురు ఇండో అమెరికన్లు ఎన్నిక
ట్రంప్ ఎన్నికతో భారతీయ విద్యార్థుల్లో ఆందోళన