జీడీపీలో రెండో స్థానానికి ఉత్తర ప్రదేశ్

మరో నాలుగేళ్లలో లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉత్తర ప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందుకెళ్తున్నారు. ఈ లక్ష్య సాధన దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉత్తర ప్రదేశ్ అవతరించింది. దేశ జీడీపీ వాటాలో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో యూపీ నిలిచింది.

భారతదేశ జీడీపీలో మహారాష్ట్ర వాటా 15.7 శాతం ఉండగా, యూపీ వాటా 9.2 శాతం ఉంది. ఇప్పటి వరకూ రెండో స్థానంలో తమిళనాడు (9.1 శాతం) ఉండగ, ఆ స్థానాన్ని ఉత్తరప్రదేశ్ ఆక్రమించిందని ఓ నివేదిక వెల్లడించింది. మన దేశ జీడీపీలో గుజరాత్ వాటా 8.2 శాతం ఉండగా, పశ్చిమ బెంగాల్ వాటా 7.5 శాతం ఉంది. కర్ణాటక (6.2 శాతం), రాజస్థాన్ (5.5 శాతం), ఆంధ్రప్రదేశ్ (4.9 శాతం) మధ్యప్రదేశ్ (4.6 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే అధికారికంగా ఇప్పటికీ తమిళనాడే రెండో స్థానంలో ఉంది.

యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తర ప్రదేశ్ గత ఏడేళ్లుగా అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తుంది. ఒకప్పుడు బిమారీ రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న యూపీ ఇప్పుడు వేగంగా ముందుకెళ్తుంది. యోగి ముఖ్యమంత్రి అయ్యాక యూపీలో నేరాలు గణనీయంగా తగ్గాయి. పారిశ్రామిక రంగ పురోగతి ఊపందుకుంది.  

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 14వ స్థానం నుంచి రెండో స్థానానికి యూపీ ఎగబాకింది. శాంతిభద్రతలను  మెరుగుపర్చడంతో పాటు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కల్పన పట్ల ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది. జీఐఎస్ 2023లో యూపీలో రూ.40 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ పెట్టుబడులు వస్తే యూపీలో కోటి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ దాదాపుస్ రూ.2 లక్షల కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా నిలిచింది. ఆ రాష్ట్ర జనాభాలో 56 శాతం మందికి ఉపాధి లభిస్తుంది. యూపీలో 96 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి.
 

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకెళ్లాలంటే 20 కోట్ల జనాభాతో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగడం ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూడా యూపీ అభివృద్ధిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతోంది. నోయిడా, కాన్పూర్, ఆగ్రా, లక్నో, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ నగరాలు యూపీ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

 
యమునా ఎక్స్‌ప్రెస్ వే కారణంగా నోయిడా పురోగతి ఊపందుకుంది. మీరట్‌ను మరో ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు యూపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. గంగా ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే యూపీలో కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది.