
* నిరాశ, నిస్పృహలకు లోనైన ప్రతిపక్షాలంటూ ప్రధాని ఎద్దేవా
గత వారం లోక్‌సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. స్మోక్ అటాక్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తుండగా ఆందోళన చేస్తున్న సభ్యుల్ని రోజువారిగా సస్పెండ్ చేస్తోంది ప్రభుత్వం. సోమవారం ఒక్క రోజే పార్లమెంట్‌లో 79 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.
అదే జోరులో మంగళవారం కూడా మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో పార్లమెంట్ నుంచి శీతాకాల సమావేశాల్లో సస్పెన్షన్‌కు గురైన వారి సంఖ్య మొత్తం 141కి చేరుకున్నది. ఈ శీతాకాల సమవేశాల మొత్తానికి వారిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
పార్లమెంట్ చరిత్రలో ఒకేసారి ఇంత మంది సభ్యులు ఎప్పుడూ సస్పెండ్ కాలేదు. తాజాగా సస్పెండ్ అయిన ఎంపీల్లో ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, కార్తీ చిదంబరం, సుప్రియా సూలే, డింపుల్ యాదవ్, మనీశ్ తివారి తదితరులు ఉన్నారు. సభలో భద్రతకు సంబంధించిన ఏదైనా సంఘటన సచివాలయం పరిధిలోకి వస్తుందని, కేంద్ర జోక్యం ఉండదని గత వారం లోక్‌సభ స్పీకర్ స్పష్టం చేశారు.
కాగా, పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షాలు నిరాశ, నిస్పృహలకు లోనయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. ఆ ఫ్రస్టేషన్‌తోనే ప్రతిపక్ష పార్టీల సభ్యులు పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ఢిల్లీలో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల ఈ తరహా ప్రవర్తన చూస్తుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ల సంఖ్యలు మరింత దిగజారుతాయనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
రాజ్యసభ చైర్మెన్‌ను వెక్కిరించిన టిఎంసి ఎంపీ
ఇలా ఉండగా, సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంట్ గేటు వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ ఆందోళనలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌కర్‌ను అనుకరిస్తూ విమర్శలు చేశారు. మకర ద్వారం మెట్ల వద్ద అనేక మంది ఎంపీల మధ్య కూర్చున్న కళ్యాణ్ బెనర్జీ తనదైన స్టయిల్‌లో మాక్ పార్లమెంట్ నిర్వహించారు.
చైర్మెన్ జగదీప్ ధన్‌కర్‌ను కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేశారు. ఆ సమయంలో అక్కడే నిలబడి ఉన్న రాహుల్ గాంధీ తృణమూల్ నేతను వీడియో తీశారు. `నా వెన్నుపూస నిటారుగా ఉంది, నేను చాలా పొడుగ్గా ఉన్నా’నంటూ రాజ్యసభ చైర్మెన్‌ను విమర్శిస్తూ తృణమూల్ ఎంపీ తన మిమిక్రీలో ఎక్కిరించారు.
విపక్ష ఎంపీలు చేసిన వెకిలి ప్రదర్శనను చైర్మెన్ జగదీప్ ధన్‌కర్ తప్పుపట్టారు. సస్పెండ్ అయిన ఎంపీల ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిగ్గు చేటు అని ధన్‌కర్ తెలిపారు. చైర్మెన్‌ను మిమిక్రీ చేయడం, స్పీకర్‌ను అనుకరించడం.. ఇది దారుణమని, చాలా సిగ్గుచేటు చర్య అని ధన్‌కర్ మండిపడ్డారు.
మరోవంక, పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై గళమెత్తిన ఎంపీలను సభ నుంచి బహిష్కరించడం పట్ల ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని దాదాపు 100 మంది విపక్ష ఎంపీలను ప్రభుత్వం బహిష్కరించడం గర్హనీయమని విమర్శించారు.
పార్లమెంట్ భద్రతపై వివరణ కోరే చట్టబద్ధ హక్కు ఎంపీలకు ఉందని, ఘటన తీవ్రతకు స్పందనగానే ఎంపీలు నిరసన చేపట్టారని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎంపీల సస్పెన్షన్ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు కూడా అయిన పవార్ పెద్దల సభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌కర్‌కు లేఖ రాశారు. విపక్ష ఎంపీలను పెద్దసంఖ్యలో సస్పెండ్ చేయడంపై పవార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
More Stories
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులు
హామీల ఎగవేతల బడ్జెట్
నన్ను జడ్జ్ చేయడానికి మీకున్న అర్హత ఏమిటి?