కాళేశ్వరంపై రేవంత్ సిబిఐ విచారణకు ఆదేశింపరే!

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం పై వివరాలు ఇవ్వాలని కాగ్ పలు దఫాలుగా కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెబుతూ కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. 
 
కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడని, ఆ డబ్బులను వసూలు చేసి పేద ప్రజల అకౌంట్స్ లో వెస్తానని గతంలో రాహుల్  గాంధీ అన్నారని ఆయన గుర్తుచేశారు. సిబిఐ విచారణ విషయంలో రేవంత్ కు ఉన్న అభ్యంతరం ఏంటి? ఎందుకు లేఖ రాయడం లేదు? అంటూ ప్రశ్నలు సంధించారు. 
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మెడిగడ్డ వరకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ మీద ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం మొత్తం మీద విచారణ జరగాలని స్పష్టం చేస్తూ స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఒక వ్యక్తి చేసిన అతిపెద్ద అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ధ్వజమెత్తారు.  సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంటూ గతంలో రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు సీఎంగా తన దగ్గర ఉన్న ఆధారాలను పంపాలని డిమాండ్ చేశారు.

బిజెపి-బీఆర్ఎస్ ఒకటేనని దుష్ప్రచారం చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కథను కంచికి చేర్చాలని చూస్తోందని బిజెపి నేత ఆరోపించారు.  నాడు రేవంత్ కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటే కరప్షన్ రావు అని అభివర్ణించారని,  నాసిరకం పనుల వల్లే పిల్లర్లు కుంగాయి అని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు.

 
కాళేశ్వరం అంటే కేవలం మేదిగడ్డ కాదని, అది ప్రాజెక్ట్ లో చిన్న భాగం మాత్రమే అని స్పష్టం చేశారు. అయితే, రేవంత్ రెడ్డి మేడిగడ్డ వరకే విషయాన్ని పరిమితం చేస్తూ ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ సంస్థపైకి మాత్రమే నెడుతున్నారని రఘునందన్ రావు  విమర్శించారు.  పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. లక్షా 5 వేల కోట్లు ఖర్చు చేసి కేవలం 42 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే అదనంగా నీరిచ్చిందని తెలిపారు.
 
కాళేశ్వరం కుంభకోణం వెనకాల  మెఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలోని ఓ ప్రజాప్రతినిధిని మెఘా పెద్దలు కలవడంతో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు బిజెపి నేత అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో రూ. 48 వేల కోట్ల లబ్ధి కేవలం మెఘా కంపెనీకి జరిగిందని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్న హైకోర్టు జడ్జి విచారణ అనేది కేసును పక్కదారి పట్టించడానికి మాత్రమే అని బిజెపి నేత స్పష్టం చేశారు. ఈ అవినీతికి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే తాను ప్రభుత్వంకు పంపానని చెబుతూ, ఇంకా కావాలంటే తాను ఇస్తానని చెప్పారు.