జ్ఞానవాపీ కేసు.. ముస్లీం పక్షాలకు ఎదురుదెబ్బ

జ్ఞానవాపీ మసీదు కేసు విషయంలో ముస్లీం పక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. అంజుమన్ ఇంతేజామియా మసీదు, యుపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన అన్ని పిటిషన్‌లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా.. ఈ కేసుకు సంబంధించిన విచారణను 6 నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది.
వారణాసి ఆలయం ఆవరణలో ఉన్న జ్ఞానవాపీ మసీదులో ఉన్న దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ హిందూ మహిళలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఆధారంగా మసీదు ప్రాంగణంలో కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో వారణాసి కోర్టు ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వాజుఖానా మినహా.. మసీదు ప్రాంగణాన్ని సైంటిఫిక్ సర్వే చేపట్టిన అధికారులు.. ఇటీవలే సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు.
అయితే హిందూ మహిళలు వేసిన పిటిషన్ కు వ్యతిరేకంగా ముస్లీం పక్షాలు మొత్తం 5 పిటిషన్లు దాఖలు చేశారు. ప్రార్థనాస్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం ప్రకారం.. మసీదు స్వరూపాన్ని మార్చకూడదని, హిందూ మహిళల పిటిషన్లను విచారణకు తీసుకోరాదని, ఏఎస్ఐ సర్వేను వెంటనే నిలిపేయాలంటూ పిటిషన్లలో కోరారు. వీటిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు.. ముస్లీం పక్షాలు వేసిన మొత్తం పిటిషన్లను తోసిపుచ్చింది. అంతేకాకుండా.. 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 21 కి వాయిదా వేసింది.
అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై హిందూ పక్షాల న్యాయవాది మాట్లాడుతూ.. జ్ఞానవాపీ మసీదు ప్రాంగణం అంతా ఆలయంలో ఒకభాగం. ఇది మతపరమైన ప్రార్థనాస్థలాల చట్టం పరిధిలోకి రాదని.. జాతీయ ప్రాముఖ్యత కలిగిన దావా అని వ్యాఖ్యలు చేశారు. తమ న్యాయపోరాటానికి అలహాబాద్ హైకోర్టు నిర్ణయం ఎంతో శక్తినిచ్చిందన్నారు. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలన్న నిర్ణయంపై మాట్లాడుతూ.. ఈ కేసు అత్యవసరమని కోర్టు ఆదేశాలు నొక్కి చెబుతున్నాయని వ్యాఖ్యానించారు.