“మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్‌”గా అస్సోం మదర్సాలు 

అసోం, డిసెంబర్ 19 ( రిథం తెలుగు):  అసోం లోని హిమంత బిశ్వశర్మ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మదర్సాలను మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్ గా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 2 వేల 250 మదర్సాలుండగా.. అందులో 1,281 మదర్సాలను సాధారణ స్కూళ్లుగా మారుస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జరీ అయ్యాయి. దీంతో ఆయా మదర్సాల్లో ఇక నుంచి మతపరమైన విద్యతో పాటు.. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్ వంటి సాధారణ సబ్జెక్టులు కూడా బోధిస్తారు. అయితే హిమంత సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 వాస్తవానికి అసోం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని మదర్సాలను మూసివేయాలంటూ.. 2020 లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఏడాది నవంబర్ 13 న నిర్వహించిన కేబినెట్ భేటీలో.. “ప్రోవిన్షియల్” మదర్సాలను సాధారణ ఉన్నత పాఠశాలలుగా మార్చాలని, ఈ మదర్సాలలో మతపరమైన విద్యను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అప్పుడా కేబినెట్‌లో హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2021 లో అస్సాం మదర్సా ఎడ్యుకేషన్ చట్టం-1995, అస్సాం మదర్సా ఎడ్యుకేషన్ చట్టం-2018 లను రద్దు చేశారు. దాంతో అప్పటి నుంచి మదర్సాలను మూసివేసే ప్రక్రయను ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. అస్సాం ప్రభుత్వం నిర్ణయంపై ముస్లింలలో కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మదర్సాలను మూసివేయడమంటే.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు అన్యాయం చేయడమేనని “ఆల్ అస్సాం మదర్సా స్టూడెంట్స్ అసోసియేషన్” ఆరోపిస్తోంది. మదర్సాలలో చదివిన చాలామంది విద్యార్థులు.. డాక్టర్లు, లాయర్లు, ఇతర ఉన్నత స్థానాలకు ఎదిగారని గుర్తుచేస్తోంది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు చేస్తోంది.
వాస్తవానికి ఈ మదర్సాల కోసం ప్రభుత్వం ఏటా దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. గత సంవత్సరం అస్సాంలో దేశ వ్యతిరేక, జిహాదీ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో నాలుగు మదర్సాలను మూసివేశారు. అంతేకాదు.. ప్రభుత్వం కేవలం మదర్సాలపైనే కాకుండా.. సంస్కృత కేంద్రాలనూ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.  ముస్లిం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని.. తద్వారా భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి ఇతర పిల్లల్లాగే దేశానికి సేవ చేయాలనేదే తమ ఉద్దేశ్యమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద.. మదర్సాలను సాధారణ స్కూళ్ళుగా మారుస్తూ అసోం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.