పవన్ కళ్యాణ్ అలక తీర్చడం కోసమే చంద్రబాబు వెళ్ళారా!

ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేస్తున్నట్లు తెలుగు దేశం పార్టీ, జనసేన నేతలు ప్రకటించినప్పటికీ కొద్దీ రోజులుగా ఆ దిశలో ప్రతిష్టంభన ఏర్పడినట్లు తెలుస్తున్నది. జనసేనకు కేటాయించే అసెంబ్లీ సీట్లపై టిడిపి ప్రతిపాదనల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. 
అందుకనే, నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం విశాఖపట్టణం వద్ద జరిగే బహిరంగసభలో ముందుగా పాల్గొనేందుకు ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ తనకు వీలుకాదని చెప్పిన్నట్లు తెలుస్తున్నది.
 
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనూహ్యంగా ఆదివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి సుదీర్ఘంగా సమాలోచనలు జరిపింది జనసేన అధినేత అలక తీర్చడం కోసమే అని పలువురు భావిస్తున్నారు. 2014 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు నాయుడు తిరిగి ఆయన ఇన్నిటికి వెళ్లడం ఇదే కావడం గమనార్హం.
 
ఎక్కవగా పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు వద్దకు వెడుతున్నారు. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర 226 రోజుల్లో 3,132 కి.మీ.దూరం పూర్తి చేసుకుని ముగియబోతోంది. 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన పాదయాత్ర సోమవారం విశాఖ శివాజీ నగర్ లో ముగియనుంది. 

 
అనంతరం ఈ నెల 20న భోగాపురం సమీపంలో పోతేపల్లి లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు చంద్రబాబు, పవన్ హాజరు కావాల్సి ఉంది. అయితే, టీడీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం జనసేనకు కేవలం 15 సీట్లు ఇవ్వాలని భావించినట్లు తెలుసుకొని అప్పటికే దాదాపు 30 సీట్లపై అంచనాలు వేసుకున్న పవన్ కళ్యాణ్ అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు. 
 
అందుకనే, లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు రావట్లేదని తేల్చిచెప్పారని భావిస్తున్నారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ సభకు పవన్ రావడం లేదని ప్రకటన కూడా చేశారు. అయితే, చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి కలిసిన తర్వాత ఈ బహిరంగసభకు హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. జనసేనకు 24 వరకు అసెంబ్లీ సీట్లు వదిలేందుకు టిడిపి అధినేత సుముఖత వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తున్నది.
 
వీరిద్దరూ కలసి సీట్ల సర్దుబాటు వ్యవహారం తొందరలో పూర్తి చేయాలని, ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఖరారు చేయాలని, ఉమ్మడిగా బహిరంగసభలు జరపాలని నిర్ణయించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. సంక్రాతి నాటికి సీట్ల సర్దుబాటు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇద్దరు నేతలు సుమారు రెండున్నర గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి? భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించామని వివరించారు.