దావూద్‌ ఇబ్రహీంపై విష ప్రయోగం.. పరిస్థితి విషమం!

కరడుగట్టిన ఉగ్రవాది, అంతర్జాతీయంగా `మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది’, 1993 ముంబై దాడుల సూత్రధారి, భారత దేశంలో అనేక ఉగ్రదాడులతో కీలక నిందితుడు, ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న`అండర్‌ వరల్డ్‌ డాన్‌’ దావూద్‌ ఇబ్రహీంపై విషప్రయోగం చేశారన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
కరాచీలో విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. అయితే దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు మాత్రమే స్థానిక మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. దావూద్‌పై విష ప్రయోగం జరిగిందనే వార్త ఏ రిపోర్టులోనూ ధృవీకరించలేదు.
రెండు రోజుల క్రితమే అతను ఆసుపత్రిలో చేరినప్పటికీ ఈ విషయాన్నీ గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం గాని, పోలీసులు గాని ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనే లేదు. పైగా, అతను తమ దేశంలో లేదంటూ ఆ దేశ ప్రభుత్వం ఇప్పటివరకు వాదిస్తూ వస్తున్నది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉండటం, విష ప్రయోగం జరిగినట్లు అనుమానిస్తోండటం వల్ల అతను చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం.
దావూద్ ఉన్న ఆసుపత్రి ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించారు అధికారులు. అక్కడ చికిత్స పొందుతున్న పేషెంట్లను వేరే బ్లాక్‌కు తరలించారు. ఆసుపత్రిలోని ఆ అంతస్తులో దావూద్ ఒక్కడే రోగి. ఉన్నత ఆసుపత్రి అధికారులు, వారి సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే అంతస్తులో ప్రవేశం ఉంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ లో ఇంటర్ నెట్ పై ఆంక్షలు కూడా విధించారు.
 
మరోవైపు.. పాకిస్థాన్‌లో దావూద్‌ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందన్న వార్తతో ఆ దేశంలో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ ఘటనతో పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయ్యిందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో కూడా సర్వర్లు పనిచేయలేదని తెలుస్తోంది. ఇది కాకుండా ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కూడా పనిచేయలేదని సమాచారం. 
 
ఇక రాత్రి 8 గంటల తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ మొత్తం తగ్గిపోయిందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ గవర్నెన్స్‌ను పర్యవేక్షించే నెట్‌బ్లాక్ అనే సంస్థ పాకిస్థాన్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం ఉన్న విషయాన్ని ధృవీకరించింది. మరోవైపు.. దావూద్ ఇబ్రహీంకు ఎవరో విషం పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయని పాక్‌కు చెందిన జర్నలిస్ట్ అర్జూ కజ్మీ పేర్కొన్నారు. ఈ ఘటనతో దావూద్ ఆరోగ్యం దారుణంగా క్షీణించిందని, ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు. 
 
ప్రస్తుతం కరాచీలోని ఓ ఆస్పత్రిలో దావూద్ చికిత్స పొందుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయని, అయితే ఇది ఎంత వరకు నిజమో తనకు తెలియదని పేర్కొన్నారు. కానీ ఈ విషయంలో ఏదో చీకటి కోణం ఉందని తెలుస్తోందని, పాకిస్థాన్‌లోని సోషల్ మీడియా, ఇంటర్నెట్ సర్వర్‌లను డౌన్ చేశారని తెలిపారు.
కరాచీలోని క్లిఫ్టన్ ఏరియాలో నివసిస్తోన్నాడు దావూద్. పాకిస్తాన్‌కు వెళ్లిన తరువాత మరో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తానీ పఠాన్ మహిళను పెళ్లాడాడు. ఆమె పేరు మైజాబీన్. దావూద్‌ ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మారుఖ్‌.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కొడుకు జునైద్‌ను పెళ్లి చేసుకున్నారు.