ఇటలీలో షరియా చట్టాన్ని అమలు చేసేది లేదు

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇస్లాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరప్ లో ఇస్లాంకు చోటు ఉండదని స్పష్టం చేశారు. తమ దేశమైన ఇటలీలో షరియా చట్టాన్ని అమలు చేయడానికి తాను అనుమతించబోనని తేల్చిచెప్పారు. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో.. ఇటాలియన్ భాషలో మాట్లాడిన జార్జియా మెలోనీ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇస్లామిక్ సంస్కృతి, యురోపియన్ నాగరికత యొక్క విలువలు మరియు హక్కులకు చాలా తేడాలు ఉన్నాయని.. ప్రధాని జార్జియా మెలోనీ అన్నారు. ఇస్లామిక్ సంస్కృతి యూరోపియన్ నాగరికతకు పూర్తిగా సరిపోదని.. అందుకే యూరప్ లో ఇస్లాంకు చోటు ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాను, షరియా చట్టాల కఠినతత్వాన్ని ఆమె తప్పుబట్టారు. ఇటలీలో పలు ఇస్లామిక్‌ సెంటర్లకు సౌదీ అరేబియా నిధులు సమకూరుస్తుందని.. ఇది పూర్తిగా తప్పు విషయం అని అన్నారు. దీనిపై కూడా తనకు సదాభిప్రాయం లేదని జార్జియా వివరించారు.
అంతేకాకుండా.. సౌదీ అరేబియాలో అమల్లో ఉన్న షరియా చట్టంపై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. షరియా చట్టం లేదా షరియా ప్రకారం వ్యభిచారానికి కఠినశిక్ష విధించడమే అని, స్వలింగ సంపర్కం, మతభ్రష్టత్వం నేరంగా భావించడమే అని అన్నారు. ఈ విధానాలు ఎక్కడైనా అమలు చేయొచ్చు కానీ.. యూరప్ లో తమ నాగరికత విలువలకు, ఇలాంటి ఇస్లాం విధానాలకు చాలా తేడాలున్నాయని అన్నారు. అందుకే ఇటలీలో షరియా చట్టాన్ని అమలు చేయడానికి అనుమతించమని జార్జియా స్పష్టం చేశారు. తమ నాగరికత యొక్క విలువలు భిన్నమైనవని చెప్పారు. ఇందులో తాను తప్పుగా ఏం మాట్లాడలేదని.. యూరప్ లో తీవ్రమవుతున్న ఇస్లామీకరణ సమస్యను లేవనెత్తడమే తన వ్యాఖ్యలకు అర్థమని తెలిపారు. రోమ్ లోని ఆమె పార్టీ నిర్వహించిన ఓ పొలిటికల్ ఈవెంట్ లో జార్జియా మెలోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా పాల్గొన్నారు.