భయం గుప్పెట్లో పాకిస్థాన్‌లో మహిళలు

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి..? శాంతిభద్రతల సమస్య ఎలా ఉంది..? ఆడవారికి రక్షణ ఉందా..? పాకిస్తాన్ కు చెందిన నటి ఆయేషా ఓమర్.. ఆ దేశంలో పరిస్థితులపై తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఎవరూ సాహసం చేయలేని విధంగా పాక్ లో ఉన్న పరిస్థితులను వివరించి సంచలనంగా మారారు.
“కిడ్నాప్ లేదా అత్యాచారం జరుగుతుందనే భయం లేకుండా నేను రోడ్డుపై నడవాలనుకుంటున్నాను.” ఇదీ.. పాకిస్థానీ నటి అయేషా ఒమర్ చేసిన వ్యాఖ్య. దీన్ని బట్టి పాకిస్తాన్ లో భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరోక్షంగా పాకిస్తాన్ లో ఆడవారికి ఎలాంటి భద్రత లేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. తాను పాకిస్తాన్ ను వదిలిపెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆయేషా ఓ ఇంటర్వ్యూలో ఆమె చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న వేధింపులను లేవనెత్తుతూ చేసిన వ్యాఖ్యలకు.. దేశంలోని చాలామంది ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘కరాచీ సే లాహోర్’ మరియు ‘రెహబారా’ అనే చిత్రాలలో నటనకు గాను ప్రసిద్ధి చెందిన పాకిస్థానీ నటి అయేషా ఒమర్, పాకిస్తాన్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్‌లో మహిళలు, పిల్లలకు సురక్షితమైన ప్రదేశం అంటూ ఏదీ లేదని నటి ఆయేషా ఒమర్ చెప్పారు. ‘నేను ఇక్కడ సురక్షితంగా లేను. నాకు రోడ్డు మీద నడవాలని ఉంది. బహిరంగ ప్రదేశాల్లో బయట నడవడం అనేది ఒక ప్రాథమిక హక్కు. మీ ఆఫీసులో ఉన్న మహిళలంతా వీధిలో నడవగలరా..? అది విచారకరం కాదా..? నాకు కారులో కూర్చోవడం ఇష్టం లేదు. నాకు సైకిల్ కావాలి. నేను బైక్ ఎందుకు నడపలేను..?’ అంటూ ఆయేషా చెప్పుకొచ్చింది. ఇటీవల తన ఇంటి దగ్గర బయట నడుస్తున్నప్పుడు అదే వీధిలో ఉన్న ఓ వ్యక్తి తనను అనుచితంగా తాకినట్లు వెల్లడించారు.
‘ప్రపంచంలోని ప్రతి దేశంలో నేరాలు జరుగుతున్నాయి. కానీ ప్రజలు కనీసం రోడ్డుపై నడవగలగుతున్నారు. పది మంది అనుసరించకుండా లేదా పిలవకుండా పార్కుకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. అసహ్యకరమైన మాటలు చెబుతూ.. తాకడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఏం చేయాలి..?’ అని అన్నారు. అంతేకాదు పాకిస్తాన్.. పురుషులకు కూడా అంతక్షేమకరంగా లేదని తేల్చిచెప్పారు. సాధారణమైన పురుషులు కూడా ప్రవేశించలేని కంటోన్మెంట్ ప్రాంతాల్లో సైన్యం విపరీతమైన ఆంక్షలున్నాయన్నారు. ఈ దేశంలో పురుషులు కూడా సురక్షితంగా లేరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ‘నేను నా దేశంలో స్వేచ్ఛగా తిరిగే సమయం ఎప్పుడు వస్తుంది..? కిడ్నాప్ చేయబడతామనే భయం లేకుండా, అత్యాచారం జరుగుతుందనే భయం లేకుండా.’ అని అన్నారు. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో మాత్రమే తాను బయట నడిచానని గుర్తు చేసుకున్న ఆయేషా.. నాగరికమైన ప్రాంతాల్లో తాను సురక్షితంగా లేనని స్పష్టంగా చెప్పారు.
‘పాకిస్తానీ స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో.. పురుషులు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఒక మహిళ జీవితపు ఆందోళనను.. కుమార్తెలు ఉన్న పురుషులు మాత్రమే అర్థం చేసుకుంటారు.’ అని ఆయేషా అన్నారు. పాకిస్తాన్ లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా ఉందని.. వారు సురక్షితంగా మరియు స్వేచ్ఛగా ఉండే వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు.