చావు బతకుల మధ్య టెర్రరిస్ట్ దావూద్.. స్కెచ్ వేసిందెవరు..?

దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్న అండర్ వరల్డ్ డాన్. ఈ వార్త.. ప్రతీ భారతీయుడికీ సంతోషం కలిగించేదే. ఎన్నని చెప్పుకోవాలి.. భారత్ ను ఎన్నిరకాలుగా అంటే అన్నిరకాలుగా కష్టాలు పెట్టిన దేశద్రోహి. మాఫియా నుంచి ముంబై పేలుళ్ల వరకు, హవాలా నుంచి బాలీవుడ్ ను హస్తగతం చేసుకునే వరకు.. పాక్ లో ఉంటూ భారత్ లో అరాచకాలు సృష్టించిన ఉగ్రవాది. అలాంటి వాడిని పట్టుకునేందుకు.. బంధించి భారత్ కు తీసుకొచ్చేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ.. ఇన్నాళ్లకు దావూద్ పై విషప్రయోగం చేశారన్న వార్తలు.. ఆసక్తికరంగా మారాయి.
“మొసాద్, CIA కంటే భారత నిఘా సంస్థలు చాలా డేంజర్.” ఇది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టేట్ మెంట్. ఎందుకంటే.. ఇటీవలి కాలంలో విదేశాల్లో ఉంటూ భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు వరుసగా హతవుతున్నారు. భారత వ్యతిరేక శక్తులన్నీ నేలకొరుగుతున్నాయి. కేనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ తో పాటు.. పాకిస్తాన్ లో పదుల సంఖ్యలో టెర్రరిస్టులు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరు చంపుతున్నారు..? వెనకున్నది ఎవరన్నది ఇంతవరకు తెలియదు. ఇలా ప్రపంచంలో ఇప్పటివరకు 20 మంది తీవ్రవాదులు రక్తం కక్కుకుని చనిపోయారు. అందుకే.. అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థల కంటే భారత నిఘా ఏజెన్సీలు ప్రమాదకరమైనవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి సందర్భంలో.. ఏకంగా దావూద్ ను చంపే ప్రయత్నం జరగడం.. యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. వాస్తవానికి ప్రతీ క్షణం పాకిస్తాన్ ఇంటలీజెన్స్ ISI రక్షణ వలయంలో ఉంటున్న దావూద్ ను పట్టుకునేందుకు భారత్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పటివరకు అతడి నీడను కూడా ఎవరూ కనుగొనలేకపోయారు. అతడు యంగ్ గా ఉన్నప్పటి ఫోటోలే తప్ప.. ప్రస్తుతం దావూద్ ఎలా ఉన్నాడో బయటి ప్రపంచానికి తెలియదు. అలాంటి ఉగ్రవాదికి ఇచ్చిన ఆహారంలో విషాన్ని కలపడంతో.. కరాచీలోని ప్రైవేటు ఆస్పత్రిలో భారీ భద్రత నడుమ చికిత్స అందిస్తున్నారు. కొన్నివార్తా ఏజెన్సీలు మాత్రం దావూద్ మరణించినట్లు చెబుతున్నా.. ఇంకా నిర్ధారణ అయితే కాలేదు. ఆస్పత్రిలోని ఓ ఫ్లోర్ మొత్తం ఖాళీ చేయించి.. అక్కడే అతడికి ట్రీట్ మెంట్ చేస్తున్నారని.. కుటుంబ సభ్యులు తప్ప మిగతావారు ఎవరినీ అనుమతివ్వడం లేదని తెలుస్తోంది.
మొన్నటికిమొన్న అమెరికాలో ఉంటున్న సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్యకు కూడా ప్రయత్నాలు జరిగాయంటూ అమెరికా ఆరోపించింది. దీని వెనుక భారత్ హస్తం ఉందనే ఆరోపణలు కూడా చేసింది. కానీ ఇంకా ఆ ఆరోపణలేవీ నిరూపితం కాలేదు. ఇన్నాళ్లూ ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ఏం చేస్తున్నారనే విమర్శలు వచ్చేవి. కానీ ఆ మధ్య వరుస విదేశీ పర్యటనలు చేశారు. సౌదీ నుంచి అమెరికా వరకు చాలా దేశాలకు వెళ్లారు. దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. అయితే ఆ పర్యటనల ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నారు.