
మరో నెల రోజుల్లో వచ్చే ఏడాది జనవరి 22న అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దిన అయోధ్య రామాలయంలో రాములవారికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మేరీలాండ్‌లో ఉన్న భక్త ఆంజనేయ ఆలయం వద్ద అమెరికన్ హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇందులో పదేండ్ల చిన్నారుల నుంచి 70 ఏండ్ల వయస్సున్న పెద్దల వరకు పెద్దసంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. అయోధ్య వేగా నామకరణం చేసిన రోడ్డులో చేతుల్లో కాషాయ జెండాలు పట్టుకుని కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా డీసీ చాప్టర్ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర సాపా మాట్లాడుతూ రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ తీశామని తెలిపారు.
రామ మందిర నిర్మాణం కోసం 500 ఏండ్లుగా పోరాడుతున్న హిందువుల కల త్వరలో నెరవేరబోతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్ డీలో జనవరి 20ను తాము కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రామ్ లీలా, శ్రీరాముని చరిత్ర, రామ భజనల వంటివి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి అమెరికన్ హిందూ కుటుంబాలు పాల్గొంటున్నాయని తెలిపారు. చిన్నారులతో 45 నిమిషాలపాటు శ్రీరాముని జీవిత చరిత్రను చెప్పించబోతున్నామని వెల్లడించారు.
కాగా, జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవ వేడుక నిమిత్తం అయోధ్యకు రావొద్దని ‘రామ మందిర్ ట్రస్ట్’ సెక్రెటరీ చంపత్ రాయ్ భక్తులను కోరారు. “విగ్రహ ప్రతిష్ఠకు ఆలయం సిద్ధం. కానీ ఆలయ నిర్మాణం పూర్తి కావాలంటే మరో రెండేండ్లు పడుతుంది. చాలా పనులు జరగాల్సి ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, వారిని రావొద్దని సూచిస్తున్నా. ఆ రోజు భక్తులు తమకు దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లాల్సిందిగా కోరుతున్నా” అని ఆయన ప్రకటించారు.
More Stories
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!
అమెరికాలో 41 శాతం పడిపోయిన విద్యార్థి వీసాలు
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ కీలక రాజకీయ నేత హతం