లిబియా పడవ ప్రమాదంలో 61 మంది గల్లంతు

లిబియా పడవ ప్రమాదంలో 61 మంది గల్లంతు
లిబియా తీరంలో పడవ మునిగిపోవడంతో 61 మంది వలసదారులు మృతి చెందారు. మహిళలు, పిల్లలతో వలస వెళ్తుండగా ఓడ మునిగిపోయింది. ఉత్తర ఆఫ్రికాలో విషాదం చోటుచేసుకుందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎమ్) తెలిపింది. మహిళలు, చిన్నారులు సహా మొత్తం 86 మందితో వెళ్తున్న పడవ బలమైన అలల తాకిడికి బోల్తా పడింది. 
 
ఈ ప్రమాదంలో 61 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వారు బతికి ఉండే అవకాశం లేదని, మరణించి ఉంటారని లిబియా అధికారులు చెబుతున్నారు.  పడవలోని మరో 25 మందిని రెస్క్యూ టీమ్స్‌ సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి.  ఆదివారం ఉదయం లిబియా తీరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
నైజీరియా, గాంబియా తదితర ఆఫ్రికా దేశాలకు చెందిన వారు ఐరోపా దేశాలకు వలస వెళ్లేందుకు లిబియా నుంచి పడవలో బయలుదేరారు. మొత్తం 86 మందితో బయలుదేరిన పడవ లిబియా తీరంలో సముద్రంలో బోల్తా పడింది.  లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణ సమీపంలో బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు వెల్లడించారు. కాగా, ఇప్పుడు ప్రమాదం జరిగిన మధ్యధరా సముద్రంలోని ఈ మార్గంలో గతంలో కూడా పలు ప్రమాదాలు సంభవించాయి. 
 
మెరుగైన జీవితం కోసం చాలా మంది ఆఫ్రికా దేశాల నుంచి యూరప్‌ దేశాలకు వలస వెళ్లేందుకు ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. యుద్ధాలు, పేదరికం నేపథ్యంలో పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల ఏటా వేల మంది యూరప్‌ కంట్రీస్‌కు వలసపోతున్నారు.  నియంత గఢాఫీ మరణాంతరం లిబియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ భూభాగంపై ఎవరికీ సరైన నియంత్రణ లేకపోవటంతో యూరప్‌కు చేరుకోవాలనుకుంటున్న వారంతా లిబియా తీరం నుంచే బయల్దేరుతున్నారు. అంతేగాక మానవ అక్రమ రవాణాదారులకు కూడా లిబియాలోని కల్లోల పరిస్థితులు అనుకూలంగా మారాయి. 
 
ఆరు దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న లిబియాలోకి ఆఫ్రికా దేశాల నుంచి వలసదారులు పోటెత్తుతున్నారు. వీరందరినీ ప్రమాదకరమైన పడవల్లో కుక్కి తీరం దాటిస్తుంటారు. ఎవరైనా పట్టుబడి తిరిగి లిబియాకు వస్తే ప్రభుత్వ నిరాశ్రయ కేంద్రాల్లో ఉంచుతున్నారు. వారిని నిర్బంధ శ్రామికులుగా మారుస్తున్నారు. వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వారి నుంచి డబ్బును లాక్కుంటున్నారు.