వివేకా కుమార్తె, అల్లుడు, సిబిఐ ఎస్పీలపై కేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య తర్వాత సునీత, అల్లుడు, సిబిఐ ఎస్పీ రాంసింగ్‌ తనను వేధించారంటూ వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌లపై పులివెందులలో కేసు నమోదు చేశారు.  వివేకా హత్యకేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల 2021 ఫిబ్రవరిలో కోర్టును ఆశ్రయించారు.
హత్య కేసులో కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని, ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్‌ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ అధికారులు కోరిన విధంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. 
 
న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కృష్ణారెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు విచారణ జరిపి వారిపై కేసు నమోదుచేయాలని ఆదేశించింది. 
 
ఈ మేరకు ఐపీసీ సెక్షన్‌ 156 (3) కింద పులివెందుల పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌లపై పులివెందుల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో ఈ ముగ్గురిపై కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.