అమిత్ షా కేసులో రాహుల్ గాంధీకి సమన్లు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి  ఉత్తర ప్రదేశ్ సుల్తాన్‌పూర్ లోని  ఎంపి-ఎమ్మెల్యే కోర్టు శనివారం సమన్లు జారీచేసింది. వచ్చే ఏడాది జనవరి 6న రాహుల్ గాంధీ కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించినట్లు న్యాయవాది ఒకరు తెలిపారు. 

డిసెంబర్ 16(శనివారం) హాజరుకావాలని గతంలో కోర్టు ఆదేశించడగా రాహుల్ గాంధీ హాజరు కాలేదు. అమిత్ షాపై రాహుల్ గాంధీ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బిజెపి నాయకుడు విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 16న రాహుల్ గాంధీ హాజరుకావాలని గతంలో సుల్తాన్‌పూర్‌కు చెందిన ఎంపి-ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీచేయగా ఆయన హాజరుకాలేదని మిశ్రా తరఫు న్యాయవాది సంతోష్ పాండే తెలిపారు. 

నవంబర్ 18న న్యాయమూర్తి యోగేష్ యాదవ్ వాదప్రతివాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తూ తదుపరి విచారణను నవంబర్ 27వ తేదీన నిర్ణయించారని, డిసెంబర్ 16న రాహుల్ గాంధీ హాజరుకావాలని సమన్లు జారీచేశారని పాండే తెలిపారు. ఒక సహకార బ్యాంకు మాజీ చైర్మన్ అయిన మిశ్రా హనుమాన్‌గంజ్‌లో నివసిస్తున్నారు.