భద్రతా ఉల్లంఘనకు, ఎంపీల సస్పెన్షన్‌కు సంబంధం లేదు

ఈనెల 13న జరిగిన పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు, ఎంపీల సస్పెన్షన్‌ కు ఎలాంటి సంబంధం లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. లోక్‌సభలో ఇద్దరు వ్యక్తుల దాడి ఘటన అనంతరం తొలిసారి ఆయన ఎంపీలకు రాసిన లేఖలో పార్లమెంటు పవిత్రతను కాపాడేందుకు సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

”ఎంపీలను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని డిసెంబర్ 13న జరిగిన ఘటనతో ముడిపెట్టి కొందరు మాట్లాడటం దురదృష్టకరం. ఆ రెంటింటికీ అసలు సంబంధమే లేదు. సభ పవిత్రతను కాపాడేందుకు సభ్యులను సస్పెండ్ చేశాం” అని తెలిపారు.

 పార్లమెంట్ భద్రతపై సమీక్షించడానికి ఉన్నతస్థాయి విచారణ కమిటీని తానే స్వయంగా ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా ఓం బిర్లా వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ఆ లేఖలో తెలిపారు. కమిటీ సమర్పించే నివేదికను పార్లమెంట్‌లో సభ్యులకు తెలియజేస్తామని స్పీకర్ వివరించారు.

కేంద్రహోం మంత్రిత్వ శాఖ నియమించిన ఈ కమిటీతోపాటు తాను కూడా ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశానని స్పీకర్ చెప్పారు. పార్లమెంట్ కాంప్లెక్సు భవన సముదాయంలో భద్రతకు సంబంధించి వివిధ అంశాలను సమీక్షిస్తుందని, సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని ఆయన తెలిపారు.

నూతన పార్లమెంటు ప్రారంభోత్సవ సమయంలోనే సభలోని ప్లకార్డులు తీసుకురాకూడదని, పోడియం వద్ద ఆందోళనకు దిగరాదని సభ్యులంతా నిశ్చితాభిప్రాయానికి వచ్చారని ఆయన గుర్తు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడం, అనుచితంగా ప్రవర్తించడాన్ని దేశ ప్రజల హర్షించరనే విషయం మనకు తెలుసని చెప్పారు. 

 ఆ కారణంగా సభ్యులంతా సభలో అత్యున్నత పార్లమెంటరీ ప్రమాణాలు నెలకొనేందుకు పాటుపడాలని ఆయన కోరారు. సమష్టి కృషి వల్ల మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని తాను కచ్చితంగా చెప్పగలనని తెలిపారు. గౌరవ సభ్యులంతా దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని నిబద్ధతతో పాటించాలని బిర్లా విజ్ఞప్తి చేశారు. 

ఈ దిశగా సభ్యులంతా తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని తాను నమ్ముతున్నట్టు స్పీకర్ ఆ లేఖలో పేర్కొన్నారు. గందరోగళం కారణంగా ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలగడంపై లోక్‌సభ స్పీకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  కాగా,  లోక్‌సభ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలంటూ పార్లమెంటులో ఆందోళనకు దిగిన 14 మంది ఎంపీలను సభాపతులు సస్పెండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకూ సభ నుంచి వీరు సస్పెండయ్యరు. 

అత్యంత సున్నితమైన జాతీయ అంశమైనందున ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేయవద్దని అధికార పక్ష సభ్యులు పేర్కొనగా, హోం మంత్రి ప్రకటన చేయాల్సిందేనని కాంగ్రెస్, టీఎంసీ తదితర విపక్ష పార్టీల ఎంపీలు పట్టుబట్టారు. దీంతో రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్‌ను, లోక్‌సభ నుంచి తొమ్మిది మంది కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే ఎంపీ కనిమొళి సహా 14 మందిని సస్పెండ్ చేశారు.