అయోధ్య నగరి సర్వాంగసుందరంగా ముస్తాబు

అయోధ్య నగరి సర్వాంగసుందరంగా ముస్తాబు

అయోధ్యలో వచ్చే నెల 22 వ తేదీన అత్యంత చారిత్రక మైలురాయిగా శ్రీరామజన్మభూమిలో శ్రీరామమందిర బ్రహ్మండ ఆరంభానికి పలువిధాలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెలరోజులకు ముందునుంచే అయోధ్య నగరి సర్వాంగసుందరంగా ముస్తాబు అయింది. పలు ప్రాంతాలలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విశిష్ట రీతి అందచందాల ఆకర్షణలు కనువిందు చేస్తున్నాయి. 

రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తి అయినట్లే. అయితే మరింతగా సకల హంగులను ఏర్పాటు చేసే ప్రక్రియ మిగిలే ఉందని రామ మందిర ధర్మకర్తల మండలి కార్యదర్శి చంపత్ రాయ్ శనివారం తెలిపారు. అత్యంత సంపూర్ణ స్థాయిలో పనులు అన్ని సంపూర్తి కావడానికి మరో రెండేళ్లు పడుతుందని రాయ్ వివరించారు.  ప్రధాన రామాలయం, గర్భగుడి నిర్మాణం పూర్తయినట్లే. 

ఈ క్రమంలో 2024 జనవరి 22వ తేదీన రామాలయ ఆరంభ ఘట్టానికి ముహుర్తం ఖరారు అయిందని వివరించారు. అయోధ్యకు ఈ తేదీన అత్యధిక సంఖ్యలో జనం రావడంపై ట్రస్ట్ నిర్వాహకులు స్పందించారు. ఇది మంచిదే కానీ ఎక్కువ మందితో నగరం కిక్కిరిసిపోతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు స్పందించాల్సి ఉంటుందని కోరారు. 

రాకుండా ఉంటేనే బాగుంటుందని, ఇందుకు బదులుగా జనం తమతమ ప్రాంతాలలోని దేవాలయాల వద్ద ఈ రోజున ఇదే సమయంలో ఆనంద మహోత్సవం నిర్వహించుకంటే మంచిదని సూచించారు. దయచేసి ఈ రోజున అయోధ్యకు రాకండి. శ్రీరాముడిని తమతమ ప్రాంతాల్లోనే పూజించండని కూడా చంపత్ రాయ్ కోరారు.

‘‘జనవరి 22న మధ్యాహ్నం 12 గంటలకు ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. గర్భగుడితో పాటు విగ్రహం సిద్ధంగా ఉంది. అయితే.. మొత్తం ఆలయ నిర్మాణం పూర్తవ్వడానికి మరో రెండు సంవత్సరాల సమయం పట్టొచ్చు. జనవరి 22న అయోధ్యకు రావొద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో సమావేశం అవ్వండి. వేరే దేవుడు, దేవతలకు సంబంధించింది అయినా సరే, మీకు సాధ్యమయ్యే ఆలయానికి వెళ్ళండి’’ అని ఆయన సూచించారు.

ఆలయ ప్రారంభోత్సవ ఘట్టానికి ప్రధాని నరేంద్ర మోదీ, అతి కొద్ది మంది ప్రముఖులు హాజరు అవుతారు. ఇక జనవరి 16వ తేదీన ప్రాణప్రతిష్టకు సంబంధించి ప్రధాన ఘట్టం చేపడతారు. వైదిక క్రతువులు అసంఖ్యాక వేద పండితులు, పురోహితుల ఆధ్వర్యంలో ఆరంభమవుతాయి. విగ్రహ ప్రతిష్ట ఘట్టం లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ఆయనే ప్రధాన సూత్రధారిగా నిర్వహిస్తారని ధర్మకర్తల మండలి వివరించింది.

వేలాది రైళ్లలో సుదూర ప్రాంతాల నుంచి ఈ విశిష్ట కార్యక్రమానికి తరలి వచ్చేందుకు లక్షలాది మంది సిద్ధమవుతున్నారు. ఆలయ గర్భగుడిలో వెలిసే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఘట్టాన్ని తిలకించేందుకు సందర్శకులు, యాత్రికులు, ప్రత్యేకించి రామభక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.