రేవంత్ ఉద్యోగ ప్రకటనను తిరస్కరించిన నళిని

 
* మహర్షి దయానంద సరస్వతి చరణాలకు అంకితం 
 
12 ఏళ్ళ క్రితం తెలంగాణ ఉద్యమంకోసం డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్న తనకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం తనకు గొప్ప సవంతన కలిగించిందని చెబుతూనే ఆ ప్రకటనను
యజ్ఞ బ్రహ్మా,వేద ప్రచరాకురాలు డి. నళిని ఆచార్య సున్నితంగా తిరస్కరించారు.
 
సోషల్ మీడియా ద్వారా తన స్పందనను తెలియచేస్తూ ఇన్నాళ్లు ఒక సస్పెండ్ ఆఫీసర్ గా ‘ సోషల్ స్టిగ్మా (మరక) ‘ను మోసానని, అప్పటి ప్రభుత్వం తనను మూడేళ్లపాటు చాలా ఇబ్బందులకు గురిచేసిందని  ఆమె గుర్తు చేసుకున్నారు.   తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, రాష్ట్ర విభజనకు అనుకూలంగా నాటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేసిన రోజుననే కొద్ది గంటల ముందు 2009 డిసెంబర్ 9 న ఆమె చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది.
ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కె రోశయ్య మహిళా దినోత్సవం రోజున ఆమెకు ఆమె ఉద్యోగాన్ని  కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఆమె రాజీనామాను ఉపసంహరించుకొని ఉద్యోగంలో తిరిగి చేరారు.  ఆ విధంగా ఉద్యోగంలో చేరడమే తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు అంటూ ఆ తర్వాత 18 నెలల పాటు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు తాను ఎదుర్కొన్న ఒత్తిడులు, అవమానాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అవ్వన్నీ తనకు అధికార యంత్రాంగంపై నమ్మకం పోయేలా చేశాయని ఆమె చెప్పారు.
 
గతంలో ఉద్యోగం ఇచ్చి వేధించారు
 
 ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ లో పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఛార్జ్ మెమోలు జారీ చేసి వివరణలు కోరడం, వార్షిక కాన్ఫిడెన్సిల్ రిపోర్టులలో తన గురించి చెడుగా  వ్రాయడంతో పాటు తన బ్యాచ్ లో తన ఒక్కరికే ప్రమోషన్ ను ఆపివేశారని, మరోవంక ప్రొబేషన్ సమయాన్ని పెంచి తనను వేధింపులకు గురిచేశారని ఆమె వివరించారు. తనను ఒంటరిగా చేసి  ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా చూశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఈ విషయాలు అన్ని నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మొర పెట్టుకొనేందుకు చూడగా ఆయన అప్పాయింట్ మెంట్ కూడా దొరకలేదని ఆమె చెప్పారు. మరోవంక, బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు తనకు సహాయం చేయక పోగా తనను ఎగతాళి చేశారని ఆమె చెప్పుకొచ్చారు.   అటువంటి సమయంలో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్,  సోనియా గాంధీ లకు తన పరిస్థితి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు వివరిస్తూ లేఖలు వ్రాశానని ఆమె వివరించారు.
అటువంటి సమయంలో ప్రత్యక్ష ఉద్యమంలో మళ్ళీ పాల్గొనడం అనివార్యంగా భావించి నవంబర్  1, 2011 న డీజీపీ కి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్లానని ఆమె తెలిపారు. శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ తన ఉద్యమ కార్యాచరణ ప్రకటించానని, దానితో ప్రభుత్వం వెంటనే దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలతో తనను సస్పెండ్ చేసిందని నళిని తెలిపారు. ఆనాడే పోలీస్ శాఖ పట్ల ఏహ్య భావం కలిగిందని చెప్పారు. 
సుష్మా స్వరాజ్ ఆ రోజే నల్గొండ సభకు రావడం, తనను అర్థం చేసుకొని అక్కున చేర్చుకోవడం తనకు కాస్త స్వాంతన చేకూర్చిందని పేర్కొంటూ తనలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ ను ఆ రోజే హత్య చేశారని ఆమె వివరించారు.  నేడు 12 ఏళ్ళ తర్వాత తెలంగాణా మూలాలు కల ఒక ముఖ్యమంత్రిగా తన కేసును పూడ్చిన శవాన్ని వెలికి తీసిన్నట్లు తెరిచి అందుకు కారణాలు తెలుసుకోవాలి అనుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 
ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించారని ఆమె కొనియాడారు. దీనితో  తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో తాను ముందు వరుసలో  ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థం అయ్యిందని ఆమె చెప్పుకొచ్చారు. ఉద్యమములో  తాను నిర్వహించిన కీలక మైన పాత్ర తనను ప్రజలకు దగ్గర చేసినా తన  బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ తనను వెలివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
గత పదేళ్లుగా తాను `ఏకాంతవాసం’ అనే శిక్షను అనుభవించడంతో ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయానని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు జీవచ్చవం లా బతికానని ఆమె తన పరిస్థితిని వివరించారు.
 
 అష్టాంగ యోగ మార్గంలో జన్మ రాహిత్యం కోసం
రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల తన జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారని, వేదమాత, యజ్ఞ దేవతలు తనలో తిరిగి ప్రాణం పోశారని చెబుతూ అందుకే తాను తన జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నానని ఆమె వెల్లడించారు. ఇప్పుడు జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నానని, వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే తన ముందున్న కర్తవ్యం అని ఆమె స్పష్టం చేశారు. 
 
దీని వల్ల తన ఆత్మ ఉన్నతి తో పాటు, సమాజ ఉన్నతికి కూడా పాటు పడిచ్చని, అందుకనే తన పంథా మర్చుకొలేనని ఆమె తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్లు ఇప్పుడు పోలీస్ గానే కాకుండా వేరే ఉద్యోగం కూడా చేయలేనని ఆమె స్పష్టం చేశారు. తన అమూల్య సమయాన్ని ప్రభుత్వ యంత్రాంగంపై వెచ్చిపలేనని, శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రియా మార్గం వైపు రాలేనని ఆమె చెప్పారు.

“క్రిమినాలజీ (న్యాయ దర్శనం) నుండి  ఫిలాసఫీ (తత్త్వ శాస్త్రం) వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా  చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి నన్ను  ఆచార్యను చేశాడు. నా ఈ ప్రస్థానం (డీఎస్పీ నుండి డిఎన్ఎ గా మారడం) చాలా సంఘర్షణ మయం, వేదనా భరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు” అంటూ తన ఆధ్యాత్మిక మార్గం గురించి వివరించారు.

 
తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడే విధంగా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని ఆమె ముఖ్యమంత్రికి తెలిపారు. “ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ నిధులను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్రం ఏర్పాటుకు వినియోగిస్తాను” అని నళిని తెలిపారు.
 
 ప్రస్తుతం తాను సనాతన ధర్మానికి మూలాలైన ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నట్లు ఆమె తెలిపారు. మహర్షి 200 వ జయంతి వరకు అది సిద్ధం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె చెప్పారు.