ప్ర‌పంచంలో అతిపెద్ద వాణిజ్య స‌ముదాయం ప్రారంభించిన ప్ర‌ధాని

ప్ర‌పంచంలో అతిపెద్ద వాణిజ్య స‌ముదాయంగా అభివృద్ధి చేసిన సూర‌త్ డైమండ్ బోర్స్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. అంత‌ర్జాతీయ డైమండ్‌, జ్యూవెల‌రీ వ్యాపారానికి ప్ర‌పంచంలోనే అతిపెద్ద, ఆధునిక కేంద్రంగా సూర‌త్ డైమండ్ బోర్స్‌ వెలుగొందనుంది. ఆభ‌ర‌ణాలు, ముడి, పాలిష్డ్ వ‌జ్రాల వ్యాపారానికి ఇది గ్లోబ‌ల్ సెంట‌ర్ కానుంద‌ని ప్ర‌ధాని కార్యాల‌యం (పీఎంఓ) ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

“ఇది సాధారణ వజ్రం కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమమైనది” అంటూ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని కొనియాడారు.  సూరత్ డైమండ్ బోర్స్  ప్రకాశం ప్రపంచంలోని అతిపెద్ద కట్టడాలను కప్పివేస్తోందని ఆయన స్పష్టం చేశారు.  “ప్రపంచంలో డైమండ్ బోర్స్ గురించి చర్చలు జరుగుతున్నప్పుడు సూరత్ డైమండ్ బోర్స్ ఇప్పుడు భారతదేశం గర్వంతో తెరపైకి వస్తుంది” అని ఆయన తెలిపారు. 

“సూర‌త్ డైమండ్ బోర్స్ భార‌తీయ డిజైన్‌లు, రూపకర్తలు, మెటీరియల్స్, కాన్సెప్ట్‌ల సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. ఈ భవనం కొత్త భారతదేశపు సామర్థ్యాలు,  తీర్మానాలకు చిహ్నం” అని ప్రధాని వివరించారు.

రూ. 3500 కోట్ల వ్య‌యంతో నిర్మించిన ఈ కేంద్రంలో 67 ల‌క్ష‌ల చ‌ద‌రపు అడుగుల విస్తీర్ణంతో 4500 డైమండ్ వ్యాపార కార్యాల‌యాల‌కు ఈ కేంద్రం వేదిక కానుంది.  ఇందులో 65 వేల మంది వ్యాపారాలు చేసుకునేలా ఏర్పాట్లు చేయడం గమనార్హం. సూర‌త్ డైమండ్ బోర్స్‌ నిర్మాణం 2015 ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కాగా 2022లో పూర్త‌యింది. ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో ఈ భ‌వ‌నం ప్ర‌పంచంలోనే అతిపెద్ద కార్యాల‌య స‌ముదాయంగా గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ గుర్తించింది.

  • వజ్రాలు, వజ్రాభరణాల అంతర్జాతీయ వ్యాపారానికి సూరత్ డైమండ్ బోర్స్ (ఎస్ డి బి) కేంద్రంగా నిలవనుంది. అత్యాధునిక హంగులతో ఈ భవనాలను తీర్చిదిద్దారు. ఇవి గుజరాత్‌లోని సూరత్‌ నగరానికి సమీపంలోని ఖాజోడ్‌ గ్రామంలో నిర్మాణం చెపట్టారు.
  • శుద్ధి చేసిన, ముడి వజ్రాల వ్యాపారానికి ఈ డైమండ్ బోర్స్ అంతర్జాతీయ కేంద్రంగా మారనుంది. అలాగే ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్‌ క్లియరెన్స్‌ హౌస్‌ కూడా ఇందులోనే ఏర్పాటు చేశారు.
  • ఆభరణాల రిటైల్‌ వ్యాపారులు సైతం తమ విక్రయ కేంద్రాలను కూడా ఇందులోనే ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. అంతర్జాతీయ బ్యాంకింగ్‌, సురక్షిత లాకర్ల సదుపాయం ఈ భవానాల్లో ఉంటుంది.
  • ముంబయి కేంద్రంగా పని చేస్తున్న అనేక మంది వజ్రాల వ్యాపారులు ఇప్పటికే ఎస్ డి బిలో ఆఫీసు స్థలాలను దక్కించుకున్నారు. వేలం పద్ధతిలో వీటిని ఎస్‌డీబీ మేనేజ్‌మెంట్‌ వారికి కేటాయించింది.
  • సూరత్ డైమండ్ బోర్స్ భవానాల్లో సుమారు 4,500 ఆఫీసులు ఉన్నాయి.
  • డైమండ్‌ రీసెర్చ్‌ అండ్‌ మర్కంటైల్‌ సిటీ లో (డ్రీం సిటీ) భాగంగానే ఎస్‌డీబీని నిర్మించారు.
  • 2015 ఫిబ్రవరి నెలలో ఆనాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ ఈ సూరత్ డైమండ్ బోర్స్ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
  • డ్రీమ్‌ సిటీలో మొత్తం 35. 54 ఎకరాల్లో విస్తరించిన ఈ సూరత్ డైమండ్ బోర్స్ ఆఫీసు సముదాయంలో మొత్తం తొమ్మిది భవనాలు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 15 అంతస్తులు నిర్మించారు.
  • ఈ సముదాయాల్లో 300 చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసు స్థలాలు ఉన్నాయ.
ఇలా ఉండగా, సూరత్ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్నికూడా ప్రధాని ప్రారంభించారు.  కొత్త టెర్మినల్ భవనం డబుల్-ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, తక్కువ వేడిని పొందే డబుల్-గ్లేజింగ్ యూనిట్, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం వంటి లక్షణాలను కలిగి ఉంది. ల్యాండ్‌స్కేపింగ్, సోలార్ పవర్ ప్లాంట్ కోసం రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగించనున్నారు