వెయిటింగ్‌ లిస్ట్‌ లేకుండా రూ 1 లక్ష కోట్లతో కొత్త రైళ్లు

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా పేరొందిన భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది రైళ్లను నడుపుతున్నప్పటికీ ప్రస్తుతం రైళ్లలో రద్దీకి ప్రస్తుతం ఉన్న రైళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. అత్యవసర సమయాల్లో వెళ్లేందుకు తత్కాల్‌ కొన్ని అందుబాటులో ఉంచుతున్నా వాటికి డిమాండ్‌ భారీగా ఉంటున్నది. అదే సమయంలో భారీగా వెయింట్‌ ఉంటుంది. దీంతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రస్తుతం ఈ వెయిటింగ్‌ లిస్ట్‌కు మంగళం పాడేందుకు భారత రైల్వే ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తున్నది. రూ.లక్ష కోట్లు ఖర్చుతో భారీగా రైళ్లను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఓ జాతీయ వార్త సంస్థకు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత రైళ్ల స్థానంలో 7వేల నుంచి 8వేల కొత్త రైళ్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 

రాబోయే నాలుగైదేళ్లలో కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా ట్రైన్లను అందుబాటులో ఉంచడంతో పాటు ట్రాక్స్‌ బలోపేతం, సేఫ్టీ టెక్నాలజీని మెరుగుపరుచనున్నది. ప్రస్తుతం రైల్వేశాఖ నిత్యం 10,754 ట్రిప్స్ నడుపుతుండగా వెయిటింగ్‌ లిస్ట్‌ను తగ్గించేందుకు మరో మూడువేల ట్రిప్స్ పెంచాలని ప్రణాళికలు వేస్తున్నది.

వాస్తవానికి కరోనా మహమ్మారి ముందటితో పోలిస్తే ప్రస్తుతం రైల్వేశాఖ 568 ట్రిప్పులను అదనంగా నడిపిస్తున్నది. ఏటా దాదాపు 700 కోట్ల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుతుండగా, 2030 నాటికి వెయ్యికోట్లకు చేరనున్నదని రైల్వేశాఖ అంచనా వేస్తున్నది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రైల్వేశాఖకు రూ.2.4లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా, ఇందులో 70 శాతం నిధులను వినియోగించినట్లు రైల్వే మంత్రి తెలిపారు. 

ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 5 వేల నుంచి 6 వేల కిలోమీటర్ల కొత్త ట్రాక్‌ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 14 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌ వేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున రోజుకు 16 కిలోమీటర్ల ట్రాక్‌ల నిర్మాణం జరుగుతుందని అశ్విని వైష్ణవ్‌ వివరించారు.