
జనవరి 2024లో రామ మందిరం ప్రారంభం అవుతున్న వేళ భక్తుల సౌకర్యార్థం అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి. దీంతో భారతీయ రైల్వేలు విస్తృత కార్యకలాపాలకు సిద్ధమవుతున్నాయి. భక్తుల తీర్థయాత్రను సులభతరం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,000 ప్రత్యేక రైళ్లను జనవరి 19 నుంచి ప్రారంభిస్తోంది.
ఇది ప్రారంభమైన మొదటి 100 రోజులలో పవిత్ర నగరాన్ని సందర్శించడానికి భక్తులకు పుష్కలంగా అవకాశం కల్పిస్తుంది. ఇది రైల్వేలకు సైతం భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టనుందని భావిస్తున్నారు. ప్రత్యేక రైళ్లను దిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూతో సహా దేశంలోని వివిధ ప్రధాన నగరాల నుంచి అయోధ్యకు రైలు సేవలను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయోధ్యలోని స్టేషన్ రద్దీని తట్టుకునేందుకు వీలుగా వసతి కల్పించడానికి అప్‌గ్రేడ్ చేశారు. ప్రారంభోత్సవం జరిగిన 10-15 రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యాంటీన్, టికెటింగ్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం అయోధ్య రైల్వే స్టేషన్ ప్రతిరోజూ 50,000 మంది ప్రయాణీకులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం జనవరి 23 నుంచి ఆలయాన్ని భక్తులకు తెరవనున్నారు. ప్రతిరోజు దాదాపు 2 లక్షల మంది విగ్రహ దర్శనం చేసుకోనేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది.
More Stories
జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వంకు అప్పగింత
కేజ్రీవాల్ అధికారిక నివాసం `శీష్మహల్’ పై సివిసి దర్యాప్తు
తగ్గనున్న వంట నూనెల ధరలు