6 గ్యారెంటీలే కాదు.. 412 హామీలనూ అమలు చేయాలి

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేవలం ఆరు గ్యారెంటీల గురించి మాత్రమే మాట్లాడటం సరికాదని బిజెపి ఎమ్యెల్యే మహేశ్వర్ రెడ్డి హితవు చెప్పారు. రాష్ట్ర శాసనసభలో శనివారం గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 412 హామీల గురించి మాట్లాడాలని ఆయన సూచించారు. 

గవర్నర్ ప్రసంగంలో కేవలం సోనియాగాంధీ పేరును మాత్రమే ప్రస్తావించారని కానీ కీలకంగా వ్యవహరించిన సుష్మారాజ్ పేరును ప్రస్తావించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.  ప్రజాదర్భార్ ను ప్రతిరోజు నిర్వహిస్తామని చెప్ప  ఇప్పుడేమో రెండు రోజులు మాత్రమే అనటం ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు.  రైతుబంధు నిధులు గురించి స్పష్టత లేదని పేర్కొంటూ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు.

కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీ కూడా బోటాబోటీగానే ఉందని, మేజిక్ ఫిగర్ కంటే నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని ఆయన గుర్తు చేశారు.  పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంపై కూడా స్పష్టతనివ్వాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. కేవలం బీజేపీ మీదపైకి నెట్టి తప్పించుకోవాలని చూడటం శోచనీయమని తెలిపారు.

రేవంత్ రెడ్డికి పాలనా అనుభవం లేకపోయినా అనుభవజ్ఞులైన మంత్రుల సూచనలు తీసుకుని పాలన సాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.  దూకుడు తగ్గించుకుని పాలన సాగించాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.  హామీలను నెరవేర్చేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కనీసం వందరోజుల సమయం ఇవ్వాలని అనుకుంటున్నామని చెబుతూఉచితాలు రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేస్తాయని గమనించాలని సూచించారు.

కేసీఆర్ సర్కార్ మాదిరిగానే నిరుద్యోగ భృతి అంశాన్ని విస్మరించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తుందని ఆరోపించారు.  కీలకమైన ఈ అంశాన్ని కూడా గవర్నర్ ప్రసంగంలో లేదని గుర్తు చేస్తూ దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ ప్రకటన చేస్తామని చెప్పారని బిజెపి నేత గుర్తు చేశారు. కానీ చెప్పిన సమయం దాటిపోయినా ఇంకా రుణమాఫీపై ప్రకటన రాలేదని ఆయన నిలదీశారు. 

ఈ విషయంలో బీజేపీ గట్టిగా పోరాడుతుందని హెచ్చరించారు. ప్రజల పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా పని చేయాలని సూచిస్తూ ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని భావిస్తున్నట్లు మహేశ్వర్ రెడ్డి చెప్పారు. కేంద్రం సొమ్ముతో గ‌త ప్ర‌భుత్వం షోకులు చేసుకుంద‌ని ఆయ‌న మండి ప‌డ్డారు. కాగా, రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని అంటూ ఒక స్థానంలో ఓడినా సీఎం అయ్యారని  చెబుతూ అంటూ పరోక్షంగా ఒక సీటులో బిజెపి అభ్యర్థి ఓడించడాన్ని ప్రస్తావించారు.