లోక్‌సభకు తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తేల్చిచెప్పేశారు. ముఖ్యనేతలు జిల్లా అధ్యక్షులు, ఇంచార్జ్ లు, పార్లమెంట్ ప్రబారీలు తదితరలతో శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ  తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో సమాన పోరాటాలుంటాయని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను అధిగమించి సీట్లు గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ ఎంత దూరమో, కాంగ్రెస్ కూడా అంతే దూరమని స్పష్టం చేశారు.
 పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, శ్రేణులకు పిలుపిస్తూ  లోక్‌సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు.  పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉండవని స్పష్టం చేస్తూ  బీఆర్ఎస్, బీజేపీ పొత్తు.. ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు. 
తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముందని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతనో బీఆర్ఎస్ కూడా తమకు అంతే అని స్పష్టం చేసిన ఆయన ఒంటరిగానే పోటీ చేసి… సత్తా చాటుతమాని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సర్వే సంస్థలకు కూడా అందని విధంగా లోకసభ ఫలితాలుంటాయని కేంద్ర మంత్రి జోస్యం చెప్పారు. రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 

వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళాలని కేడర్‌కు సూచించారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్న పాల్గొనకపోయినా.. బీజేపీ శ్రేణులు మాత్రం పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కొత్తగా ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలపైన ఉమ్మడి పది జిల్లాల వారిగా సమీక్ష ఉంటుందని చెబుతూ రాష్ట్ర స్థాయి నేత ఈ సమీక్షలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని పేర్కొంటూ  అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ఇప్పటి నుంచే దానికి అవసరమైన కసరత్తులు క్రిందిస్థాయి నుంచి ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన అన్ని కమిటీల నియామకాలను పూర్తి చేయాలని జిల్లా స్థాయి నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.  పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరులో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలంగాణలో పర్యటిస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
 
అటు అసెంబ్లీ లాబీలో బిజెఎల్పీకి ప్రత్యేక గది కేటాయించారు. అసెంబ్లీ బయట కూడా ఛాంబర్ ఇవ్వాలని బిజెపి ఎమ్మెల్యేలు కోరారు. ఛాంబర్ కోరుతూ స్వీకర్ కు బిజెఎల్పీ వినతి పత్రం ఇచ్చారు.