బంగ్లాదేశ్ ఏర్పాటుతో ప్రపంచాన్ని నివ్వెర పరచిన భారత్

* భారత్ సైనికుల చారిత్రాత్మక విజయం `విజయ్ దివాస్’
బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన 1971లో నిర్ణయాత్మక విజయాన్ని స్మరించుకోవడానికి డిసెంబర్ 16ను `విజయ దివస్’ గా జరుపుకుంటున్నాము. గత 75 ఏళ్లలో భారత సైనికుల ముంగిట శత్రు సైనికులు లొంగిపోవడంతో  యుద్ధభూమిలో ఏకపక్షంగా సాధించిన ఏకైక విజయం ఈ యుద్ధంలోనే అని చెప్పవచ్చు. మిగిలిన యుద్దాలు అన్ని `కాల్పుల విరమణ’తో ముగిసాయి.
 
అంతేకాదు, అమెరికా వంటి అగరరాజ్యాల హెచ్చరికలను ఖాతరు చేయకుండా, పాశ్చాత్య దేశాలు భారత్ పై కత్తిగట్టిన లెక్కచేయకుండా, అరకొర వనరులతో ఒక విధంగా ప్రపంచాన్నే ఎదిరిస్తూ భారత్ అత్యంత సాహసోపేతంగా యుద్ధభూమిలో దిగి అందరిని నివ్వెర పరచి నూతన చరిత్రకు దారితీసిన యుద్ధం కూడా ఇదే.
ఈ యుద్ధం తర్వాతనే భారత్ ను ఒక శక్తిగా ప్రపంచం గుర్తించడం ప్రారంభమైంది. అంతర్జాతీయ వ్యవహారాలలో భారత్ ను విస్మరింపలేని పరిస్థితులు నెలకొనడం మొదలైంది. ఒక వంక సైనికంగా, మరోవంక ఆర్థికంగా భారత్ శక్తివంతంగా అభివృద్ధి చెందేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.  అంతేకాదు, బ్రిటిష్ పాలకులు దుర్బుద్ధితో అత్యంత అసహజంగా, ఎటువంటి చారిత్రక – భౌగోళిక నేపథ్యం లేకుండా దేశాన్ని ముక్కలు చేసి ఏర్పాటు చేసిన పాకిస్తాన్ నిర్మాణ సౌథవాలను భారత్ కూల్చివేసిన సందర్భం ఇది.
 
1971 నాటి యుద్ధంలో  భారత్ సైనికులకన్నా మూడింతలుగా ఉన్నా, అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉన్న ఘోర పరాజయాన్ని చవిచూసిన పాక్ సేనలు తిరిగి భారత్ పై ప్రత్యక్షంగా యుద్ధం చేసేందుకు సాహసింపలేదు. ఆ తర్వాత ఒకసారి కార్గిల్ పర్వతాలపై దొంగచాటుగా చొరబడి చావుదెబ్బ ఠీన్నారు. అందుకనే నేరుగా భారత్ తో తలబడలేమని సీమాంతర ఉగ్రవాదంను ఆశ్రయిస్తూ వస్తున్నారు.
 
డిసెంబర్ 3, 1971న 11 భారతీయ ఎయిర్ స్టేషన్లపై పాకిస్తాన్ వైమానిక దాడులతో కవ్వింపు చర్యలకు పాల్పడడంతో ప్రారంభమైన యుద్ధం 13 రోజుల తర్వాత సుమారు లక్ష మంది ఆ దేశ సైనికులు లొంగిపోవడంతో బాంగ్లాదేశ్ దేశంగా ఆవిర్భవించడంతో ఆగిపోయింది.
 
మన ప్రధాని ఇందిరా గాంధీని తమ దేశంకు పిలిపించి జోక్యం చేసుకోవద్దని అమెరికా హెచ్చరించినా ఆమె ఖాతరు చేయలేదు. `కొన్ని వేల మైళ్ళ దూరం నుండి వర్ధమాన దేశాలను ఆడించాలి అనుకుంటే కుదరదు’ అంటూ అమెరికా అహంకారంపై ఆమె ఘాటుగా స్పందించారు. ఒక యుద్ధ నౌకను ఆయుధాలతో భారత్ పైకి పంపినా బెదరలేదు.
 
వ్యూహాత్మకంగా ముందుగానే నాటి సోవియట్ యూనియన్ తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆ ఆపద సమయంలో మనకు అండగా మిగిలింది. భారత్ పై రెండు వైపులా నుండి దాడి చేయడంతో పాటు, మరోవైపున చైనాతో దాడి చేయించాలని పాక్ ఎత్తుగడలను మన సైనికులు అత్యంత సాహసోపేతంగా తిప్పికొట్టారు.
 
తూర్పు పాకిస్తాన్ లో మారణహోమం
తూర్పు పాకిస్తాన్‌లో, హిందువులు, ముస్లింలు దాదాపు 75 మిలియన్ల మంది బెంగాలీ మాట్లాడతారు. బెంగాలీ ముస్లింలు విభిన్నమైన నాగరికత, రాజకీయ ఆలోచనలు కలిగి ఉండడంతో పాటు జనాభా రీత్యా కూడా ఎక్కువగా ఉండడంతో పాకిస్తాన్ పాలకులు వారికి తమ ప్రభుత్వంలో తగు భాగస్వామ్యం కల్పించకుండా క్రూరంగా అణచివేస్తూ వచ్చారు. దానితో వారిలో పెబుల్లికిన జాతీయవాద భావనాలు ఈ యుద్దానికి దారితీసాయి. 
 
పైగా,  పశ్చిమ – తూర్పు పాకిస్తాన్ ల మధ్య దాదాపు 1600 కిలోమీటర్ల భౌగోళిక దూరం ఉండడంతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య పొంతన లేకుండా పోయింది. పశ్చిమ పాకిస్తాన్‌లోని పాలకులు బెంగాలీ భాష , సంస్కృతిని అణచివేయడానికి చేసిన ప్రయత్నాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వారిలో ప్రత్యేక దేశం వాదనలకు ఆస్కారం కల్పించాయి. 
 
1951లో పాకిస్తాన్ ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించినప్పుడు తూర్పున నిరసనలు వెల్లువెత్తాయి. బెంగాలీని రెండవ భాషగా గుర్తించాలని ప్రజలు విజ్ఞప్తి చేసినా పాకిస్తాన్ పాలకులు పట్టించుకోలేదు. దానితో తలెత్తిన ఉద్రిక్తతలు 1970లో తొలిసారి జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో  షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 
 
 అయితే పశ్చిమ పాకిస్తాన్ పాలకులు వారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కును నిరాకరించారు. పశ్చిమ పాకిస్తాన్ ప్రధాన మంత్రి యాహ్యా ఖాన్ తూర్పు పాకిస్తాన్‌లో మార్షల్ లా విధించారు. 1971 యుద్ధానికి కొన్ని నెలల ముందు, తూర్పు పాకిస్తాన్ వీధులు నిరసనలతో ప్రతిధ్వనించాయి రక్తం చిందించారు. పాకిస్తాన్ సైన్యం చర్యలను యూదులపై హిట్లర్ చేసిన హోలోకాస్ట్‌తో పోల్చారు.
 
మార్చి 1971లో, పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్ నుండి దేశభక్తి, భాషాభిమానాన్ని తొలగించాలని నిర్ణయించుకుంది. పాకిస్తాన్ సైన్యంచే ఆపరేషన్ సెర్చ్‌లైట్ ప్రారంభించి బెంగాలీ జాతీయవాదులపై క్రూరమైన అణిచివేత ప్రారంభమైంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో స్త్రీ, పురుషులిద్దరూ కీలక పాత్ర పోషించడం గమనార్హం.
 
పశ్చిమ పాకిస్తాన్‌లోని మత పెద్దలు బెంగాలీ స్వాతంత్ర్య సమరయోధులను “హిందువులు” అని బహిరంగంగా ప్రస్తావించారు, ఆ సమయంలో బెంగాలీ జనాభాలో 80 శాతం మంది ముస్లింలు. అంతే కాదు, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని బలహీన పరిచేందుకు బెంగాలీ మహిళలపై  అత్యాచారం వంటి నేరాలకు మద్దతు ఇచ్చారు.
 

తూర్పు పాకిస్థాన్‌లో మహిళలను గర్భం దాల్చాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ సైనికులు అత్యాచారానికి పాల్పడ్డారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తొమ్మిది నెలల కాలంలో, పాకిస్తాన్ సైన్యం, బంగ్లాదేశ్‌లోని ఇస్లామిక్ గ్రూపుల సహకారంతో, 2 నుండి 3 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలను తీసింది. 2 నుండి 4 లక్షల మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.

 
అయితే, అధికారికంగా, పాకిస్తాన్ మరణాల సంఖ్య 26,000 మాత్రమేనని గుర్తించింది. పాకిస్తాన్ సైన్యం ఆదేశాల మేరకు బంగ్లాదేశ్‌లోని బౌద్ధ సమాజంలోని మేధావుల సమాజంలోని పెద్ద వర్గాన్ని ఊచకోత కోశారు. అంతే కాదు, లొంగిపోవడానికి కేవలం రెండు రోజుల ముందు, డిసెంబర్ 14, 1971 న, పాకిస్తాన్ సైన్యం 100 మంది వైద్యులు, ప్రొఫెసర్లు, రచయితలు,  ఇంజనీర్లను అపహరించి, హత్య చేసి, వారి మృతదేహాలను సామూహిక సమాధిలో వదిలివేసింది.
 
బంగ్లాదేశ్‌లోని ముక్తి బహినీ తనదైన రీతిలో పోరాడింది. కాలేజీ విద్యార్థులు, సామాన్యులు, అందరూ స్వాతంత్రం కోసం పోరాడారు. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో, భారత్ బంగ్లాదేశ్‌కు రేషన్  దాని సైన్యాన్ని పంపడం ద్వారా మద్దతు ఇచ్చింది. యుద్ధ సమయంలో వేలాది మంది బంగ్లాదేశీయులు భారత్‌లో ఆశ్రయం పొందారు.
 
భారత్ వైమానిక స్థావరాలపై దాడి
 
డిసెంబర్ 3న పాకిస్థాన్ 11 భారతీయ వైమానిక స్థావరాలపై దాడి చేయడంతో  ప్రతిస్పందనగా, భారత్ పాకిస్తాన్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో వైమానిక దాడులు నిర్వహించడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. దీనిని అనుసరించి, భారతీయ ప్రభుత్వం ‘తూర్పు పాకిస్తాన్’ ప్రజలను రక్షించడానికి పాకిస్తాన్‌పై యుద్ధంలో పాల్గొనాలని భారతీయ సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది.
 
ఒక్క పాక్ సైనికుడిని కూడా ముందడుగు వేయకుండా అత్యంత వీరోచిత ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత సేనలకు ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా అత్యంత సమర్థవంతమైన నేతృత్వం వహించారు. కేవలం 13 రోజుల్లో యుద్ధం ముగియగా, డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎ.ఎ. ఖాన్ నియాజీ సుమారు 93,000 మంది సైనికులతో భారత్‌కు లొంగిపోయాడు.
 
ఫలితంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ `విజయ దివాస్’ జరుపుకుంటున్నాము.  1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధం మొదటి వారం ముగిసే సమయానికే, భారతీయ వైమానిక దళం దాదాపు పూర్తిగా వైమానిక ఆధిపత్యాన్ని సాధించింది. భారతీయ, బంగ్లాదేశ్ వైమానిక దాడుల కారణంగా తేజ్‌గావ్, కుర్మిటోలా, లాల్మోనిర్హాట్, షంషేర్ నగర్‌లోని నంబర్ 14 స్క్వాడ్రన్‌తో సహా తూర్పు ప్రాంతంలో మొత్తం పాకిస్తానీ వైమానిక దళంను పూర్తిగా కట్టడి చేయగలిగింది. 
 
భారతీయ నౌకాదళానికి చెందిన నౌకాదళ యుద్ధనౌకలు, ముఖ్యంగా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కు చెందిన సీ హాక్ ఫైటర్ జెట్‌లు, చిట్టగాంగ్, బారిసాల్, కాక్స్ బజార్‌లపై కూడా వైమానిక దాడులు నిర్వహించడంతో తూర్పు పాకిస్తాన్ నావికాదళం మొత్తం అంతరించిపోయింది. తూర్పు పాకిస్తాన్ నౌకాశ్రయాలను సమర్థవంతంగా దిగ్బంధించడంతో  చిక్కుకున్న పాకిస్తానీ సైనికులకు తప్పించుకునే అన్ని మార్గాలను మూసివేసిన్నట్లయింది. 
 
1971 యుద్ధంలో దాదాపు 3,900 మంది భారతీయ సైనికులు అమరులయ్యారని, దాదాపు 9,851 మంది గాయపడ్డారని చెప్పారు. యుద్ధం జరిగిన ఎనిమిది నెలల తర్వాత, ఆగష్టు 1972లో, భారత్- పాకిస్తాన్ సిమ్లా ఒప్పందంపై సంతకం చేశాయి.దీని ప్రకారం పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను పాకిస్తాన్‌కు తిరిగి పంపించారు.
 
ఆర్ఎస్ఎస్ “ప్రహార్ మహాయజ్ఞం”
 
97,368 మంది పాకిస్తానీ సైనికులు భారత్‌లోని పరాక్రమ సైన్యానికి లొంగిపోయిన రోజును పురస్కరించుకుని, స్వయంసేవకుల పట్టుదల, సామర్థ్యాలను పెంచడం, వారిలో విజయ స్ఫూర్తిని నింపే లక్ష్యంతో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) “ప్రహార్ మహాయజ్ఞం” అనే గొప్ప వేడుకను ఈ సందర్భంగా నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న స్వయంసేవకులు మన స్ఫూర్తిదాయక వారసత్వాన్ని, భారతీయ వీరుల పరాక్రమంను గుర్తుచేసుకుంటారు. 
 
మహారాణా ప్రతాప్, హల్దీఘాటి యుద్ధంలో తన కత్తితో తన గుర్రంతో సహా బహదూర్ ఖాన్‌ను ఒక్క దెబ్బతో నరికివేశాడు. రాణి దుర్గావతి తన గుర్రపు పగ్గాలను నోటిలో పట్టుకుని, రెండు చేతులలో కత్తి పట్టుకుని, శత్రువులను కబళించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్, తన ఖడ్గ బలాన్ని ఉపయోగించి, ఆదిల్షాహీ, మొఘల్ సామ్రాజ్యాలను సవాలు చేస్తూ హిందూ పాలనను స్థాపించాడు. మనం ఈ గొప్ప పూర్వీకుల వారసులం. మన చేతులలోని బలం శాశ్వతంగా ఉండనివ్వండి. మనం సమర్థంగా, శక్తివంతంగా కొనసాగుతామని జ్ఞప్తి చేసుకుంటారు.