పోలీస్ యూనిఫామ్ నుండి వేద ప్రచారకురాలిగా ఉద్యమకారిణి

*ఆధ్యాత్మిక జీవనంలో మాజీ డీఎస్పీ నళిని
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో  మార్మోగిన పేరు డీఎస్పీ నళిని. తెలంగాణ కోసం ఉద్యమించే నా అన్నాచెల్లెళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. తన డీఎస్పీ కొలువునే వదిలేసుకున్నారు. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పాలకులను కదిలించింది. 
 
ఉన్నత ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమంలో భాగమయ్యారు నళిని. ఢిల్లీలో రెండు సార్లు దీక్షకు సైతం కూర్చున్నారు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. తమ విద్యుక్తధర్మంలో భాగంగా  తన అన్నదమ్ములపైకి లాఠీలు లేపలేనని, తుపాకీని ఎక్కుపెట్టలేనంటూ ఎంతో కష్టపడి సంపాధించుకున్న తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన ఆమె  ప్రస్తావన పుష్కరకాలం తర్వాత ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. 
 
నళినికి రాష్ట్రం సిద్ధించాక గానీ, గత ప్రభుత్వంలో గానీ ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఆమె గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ప్రభుత్వం మారగా ఇప్పుడైనా ఆమెకు సరైన గుర్తింపు దక్కాలని, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
 
ఆమెకు పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇప్పుడు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు.
 
అయితే, ఇప్పుడు తనకో ఉద్యోగం కావాలంటూ, తన త్యాగానికి గుర్తింపు కావాలంటూ ఎవ్వరివెంటా పడే పరిస్థితులలో ఆమె లేరని తెలుస్తోంది. కానీ పుష్కరకాలం తర్వాత తనను తలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తన అభిమతాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.  నళిని ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నారు. పూర్తి సాత్వికంగా మారారు.
 
ఉద్యమ సమయంలో ఆమెను డిసెంబర్ 4, 2011న సస్పెండ్ చేయడంతో మీడియాలో సంచలనంగా మారారు. ఆమెను దేశ ద్రోహంకు పాల్పడినట్లు నిందించడంతో ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలో అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఒక్కరే తనపై ఆ విధమైన ముద్ర వేయడాన్ని ఖండించారని ఆమె గుర్తు చేసుకొంటున్నారు.  
 
ఇక ఆమె డిఎస్పీ ఉద్యోగంపై రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికలో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం వంటివి అన్ని ఉద్యమంలో భాగంగానే చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె  ఎవరినీ కలవలేదు. ఏమీ అడగలేదు. కనీసం రాజీనామాను ఉపసంహరించు కొంటున్నట్లు ప్రభుత్వంకు వినతి పత్రం కూడా ఎన్నడూ ఇవ్వలేదు.
 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆమె ఏమయ్యారు? నళిని గురించి ఎవరికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. 2014లో ఉద్యమ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తెలంగాణ పేరుతో ఎందరో ఎన్నో సంపాదించుకున్నారు. ఎంతో మంది  తెలంగాణ ఉద్యమాన్ని బొందపెట్టాలని చూసినవాళ్లు కూడా అధికారాన్ని, రాజభోగాలను అనుభవించారు. మరి నిజమైన ఉద్యమకారిణిగా పోరాడిన నళినికి న్యాయం ఎందుకు జరగలేదు? ఎవ్వరూ ఎందుకు పట్టించుకోలేదు?
కానీ ఆమె తనవంతుగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత త్యాగి నుండి యోగినీ అయ్యి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదం, యోగాలను ప్రచారం చేశాను. రోగిని కూడా అయి  కోలుకున్న తర్వాత ఇప్పుడు తపస్వినై, నిత్యాగ్నిహోత్రిని అయ్యి సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నారు. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. 
 
“ఆనాడు నాలో పొంగింది దేశ భక్తి అయితే, ఇప్పుడు నాలో దైవ భక్తి నిండి ఉంది. ప్రస్తుతం నాలో క్షాత్రత్వం పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది” అంటూ తన గురించి చెప్తున్నారు. ఏదో తనకు తోచిన విధంగా జీవిస్తున్న తనను ఇప్పుడు పుష్కరకాలం తర్వాత గుర్తుపెట్టుకోవడం, తనకు ఉద్యోగం తిరిగి ఇవ్వాలనే డిమాండ్ లేవనెత్తడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
 
అయితే, తనను ఇప్పుడు విధుల్లోకి తీసుకున్నా ఉద్యోగానికి న్యాయం చేయలేననని ఆమె సోషల్ మీడియా ద్వారా తేల్చి చెప్పారు. 12 ఏళ్లు విరామం రావడం వల్ల సర్వీస్ రూల్స్ కూడా ఒప్పుకోవని ఆమె తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల పోలీస్ ఉద్యోగానికి అవసరమైన శారీరక సామర్థ్యం కూడా కోల్పోయానని ఆమె  వెల్లడించారు. 
 
ఒకవేళ కాదు, కూడదని ఉద్యోగంలోకి తీసుకున్నా కోర్టులో చిక్కులు ఎదురవుతాయని ఆమె వివరించారు. ‘న్యాయం చేయలేను..’ అంటూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు. పైగా, చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ ఆప్టిట్యూడ్‌ను కూడా తాను కోల్పోయానని ఆమె నిజాయతీగా చెప్పేసారు.