శ్రీకృష్ణ జ‌న్మ‌భూమి భూవివాదం స‌ర్వేకు హైకోర్టు అనుమతి

ఉత్తర ప్రదేశ్ లోని మ‌ధుర‌లో ఉన్న శ్రీకృష్ణ జ‌న్మ‌భూమి భూవివాదం గురించి గురువారం అల‌హాబాద్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌ధుర‌లోని షాహీ ఇద్గా మ‌సీదులో స‌ర్వే చేప‌ట్టాల‌ని హైకోర్టు తెలిపింది. అయితే స‌ర్వే నిర్వ‌హించేందుకు కావాల్సిన ప్యానెల్ స‌భ్యుల గురించి సోమ‌వారం కోర్టు ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాలు ఉన్నాయి. 
 
ఇటీవ‌ల వార‌ణాసిలోని జ్ఞాన‌వాపి మ‌సీదులో కూడా కోర్టు ఆదేశాల ప్ర‌కారం స‌ర్వే చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. షాహి ఈద్గా మ‌సీదును 17వ శ‌తాబ్ధంలో నిర్మించారు. కోర్టు నియ‌మిత క‌మీష‌న‌ర్ ఆధ్వ‌ర్యంలో స‌ర్వే చేప‌ట్ట‌నున్నారు. శ్రీ కృష్ణుడు జ‌న్మించిన స్థలంలో ముస్లింలు మ‌సీదు నిర్మించిన‌ట్లు హిందువులు ఆరోపిస్తున్నారు. 

హిందూ సేన‌కు చెందిన విష్ణు గుప్త స‌ర్వే కోసం డిమాండ్‌చేశారు. విష్ణు గుప్త దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను స్థానిక కోర్టు గ‌త డిసెంబ‌ర్‌లో స్వీక‌రించింది. అయితే ముస్లింలు అభ్యంత‌రం వ్యక్తం చేస్తూ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. తాజా తీర్పును వ్య‌తిరేకిస్తూ ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశాలు ఉన్నాయి.శ్రీకృష్ణ జ‌న్మ‌స్థానంలో ఉన్న మొత్తం 13.37 ఎక‌రాల భూమిపై హిందువుల‌కే హ‌క్కును క‌ల్పించాల‌ని హిందూసేన డిమాండ్ చేస్తోంది.

ఇక్క‌డ ఉన్న కాట్ర కేశ‌వ దేవ్ ఆల‌యాన్ని కూల్చి దాని స్థానంలో మ‌సీదును నిర్మించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు ఆదేశాలతో ఆ అక్ర‌మ నిర్మాణం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. శ్రీ కృష్ణ జ‌న్మ‌స్థానం గురించి 1968లో ఓ ఒప్పందం జ‌రిగింది. సేవా సంస్థాన్‌, షాహీ మ‌జీద్ ఈద్గా ట్ర‌స్టు మ‌ధ్య సంత‌కాలు జ‌రిగాయి.

ఆ ఒప్పందం ప్రకారం శ్రీకృష్ణ జ‌న్మ‌భూమికి 10.9 ఎక‌రాలు, మ‌సీదుకు 2.6 ఎక‌రాలు ఇవ్వ‌డం జ‌రిగింది. కృష్ణ జ‌న్మ‌భూమి- షాహి మ‌జ్జీద్ మ‌ధ్య మొత్తం 18 ఎక‌రాల గురించి వివాదం ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.