పార్లమెంట్‌ భద్రతాపై ఎనిమిది మంది అధికారుల సస్పెన్షన్‌!

పార్లమెంట్‌లో బుధవారం వెలుగు చూసిన భారీ భద్రతా లోపం  వ్యవహారంలో పార్లమెంట్‌ హౌస్‌ సెక్యూరిటీకి చెందిన ఎనిమిది మంది అధికారులను సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన భద్రతా సిబ్బందిలో రాంపాల్, అరవింద్, వీరదాస్, గణేశ్‌, అనిల్, ప్రదీప్, విమిత్, నరేంద్ర ఉన్నారు.  నిన్నటి ఘటన నేపథ్యంలో పార్లమెంట్‌ పరిసరాల్లో భారీగా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు.
అటువైపుగా వెళ్లే ప్రతి వాహనాన్ని, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే లోక్‌సభ సెక్రటేరియట్‌ కొత్త భవనం వైపుగా వెళ్లే సభ్యులు స్మార్ట్‌కార్డ్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని ఎంపీలను కోరింది.  లోక్‌సభ, రాజ్యసభ లాబీ, పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని మరికొన్నిచోట్ల ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ కల్పించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభ ఇప్పటికే విజిటర్లకు ఇచ్చే పాస్‌లపై నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం కొనసాగనున్నది.
ఈ ఘటనపై ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్‌స‌భ‌లో ఓ ప్రకటన చేస్తూ ప్ర‌తి ఒక్క‌రూ ఆ స్మోక్ అటాక్ ఘ‌ట‌న‌ను ఖండించిన‌ట్లు చెప్పారు. ఈ అంశంపై స్పీక‌ర్ త‌న నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశం గురించి ఎవ‌రికి పాసులు ఇవ్వాల‌న్న అంశంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న తెలిపారు.  భ‌విష్య‌త్తులో ఇలాంటి అంశాల‌పై అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.
పార్లమెంట్ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని వ్యక్తులను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పార్లమెంట్ పాసులు ఉన్న వారికి మాత్రమే పరిసర ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశం పోలీసులు ఇస్తున్నారు. పార్లమెంట్ భవనానికి దారి తీసే మార్గాలన్నింట్లో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టు చట్టం చేశారు.
దీంతోపాటు ఎంపీలు, వీఐపీల సెక్యూరిటీ ప్రోటోకాల్‌ల పూర్తిగా మార్చేశారు. ఇక నుంచి ఎంపీలు, సిబ్బంది, ప్రెస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు వివిధ గేట్ల నుంచి పార్లమెంట్ హౌస్‌లోకి ప్రవేశించేలా నిబంధనలను మార్చారు. ఇక పార్లమెంటులోకి సందర్శకులు రావడాన్ని అనుమతిస్తే.. ఇక నుంచి వారు పాత గేటు నుంచి లోపలికి ప్రవేశించలేరని అధికార వర్గాలు తెలిపాయి. విజిటర్స్‌కు నాలుగో గేటు నుంచి పార్లమెంట్ హౌస్‌లోకి ప్రవేశించేలా కొత్త నియమాలు తీసుకువచ్చారు.
 
ప్రస్తుతానికి విజిటర్ పాస్‌లు జారీ చేయడంపై పూర్తి నిషేధం విధించారు. మరోవైపు.. సందర్శకులు కూర్చునే గ్యాలరీని పూర్తిగా అద్దాలతో కప్పనున్నారు. భవిష్యత్‌లో మళ్లీ ఎవరూ అలాంటి భద్రతా ఉల్లంఘనలకు పాల్పడకూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అటు.. ఎయిర్‌పోర్టుల్లో అమర్చే బాడీ స్కానర్‌లను పార్లమెంట్ హౌస్‌లో కూడా అమర్చనున్నారు.