లోక్‌సభలోకి టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు

శీతకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌‌లో బుధవారం భద్రతా వైఫల్యం కలకలం రేపింది. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా సభ చాంబర్‌లోకి దూకారు. అనంతరం అక్కడ ఉన్న టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.  వారి షూ నుంచి పసుపు రంగు గ్యాస్‌ వెలువడింది. జీరో అవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఎంపీలు సభ నుంచి బయటకు పరుగులు తీశారు. అనూహ్య పరిణామంతో సభను స్పీకర్‌ ఓం బిర్లా వాయిదా వేశారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.  వీరిలో ఓ మహిళ ఉన్నారని అధికారులు తెలిపారు. నిందితులను నీలం, అమోల్ షిండేగా గుర్తించారు. 
 
పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన వార్షికోత్సవం రోజునే ఈ ఘటన జరగడం గమనార్హం.  2003 డిసెంబరు 13న పాక్ ఉగ్రవాదులు పార్లమెంట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య దేవాలయంపై జరిగిన ఈ దాడిలో 9 మంది అమరులయ్యారు.  ఉగ్రదాడిలో అమరులైన వారి కోసం సంస్మరణ సభను పార్లమెంట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేయగా  ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్‌, కేంద్రమంత్రులు సహా పత్రిపక్ష నేతలు నివాళులర్పించారు. 
 
ఈ కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికే ఆగంతకులు విజిటర్స్ గ్యాలరీ నుంచి చాంబర్‌లోకి దూకారు. జీరో అవర్ జరుగుతుండగా ఉత్తర మాల్దా బీజేపీ ఎంపీ ఖాగేన్ ముర్ము మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఘటన చోటుచేసుకుంది. నిందితులు మైసూర్ ఎంపీ ప్రతాప్ పాస్‌లతో పార్లమెంట్‌లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ‘తానా షాహీ బంద్ కరో.. భారత్ మాతాకీ జై’ అనే నినాదాలు చేశారు.

కాగా, ఇటీవలే ఖలిస్థాన్‌ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్‌జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిందే. ఈనెల 13లోగా పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ ఈనెల 6వ తారీఖున హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని కూడా సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశాడు. 

‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్‌’ (ఢిల్లీ ఖలిస్థాన్‌గా మారబోతోంది) అనే శీర్షికతో వీడియో రిలీజ్‌ చేశాడు. ఈనెల 13వ తేదీ లేదా అంతకంటే ముందే భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామని బెదిరించాడు. 2001 పార్లమెంట్‌ దాడి దోషి అఫ్జల్‌ గురు పోస్టర్‌ను కూడా అందులో ప్రదర్శించాడు. ఈ వీడియోలో తనని చంపేందుకు భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని పేర్కొన్నాడు.

పన్నూన్‌ హెచ్చరికల నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం ఉగ్రకుట్రలో భాగమని అధికారులు భావిస్తున్నారు. అనూహ్య పరిణామంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్‌ ఆవరణలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఆగంతకులు పార్లమెంట్‌ ఆవరణలో నక్కి ఉన్నారామో అన్న అనుమానంతో అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

2001 డిసెంబరు 13న లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలకు చెందిన ముష్కరులు పార్లమెంట్‌ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి కాల్పులకు తెగబడ్డారు. యావత్ దేశం ఈ ఘటనతో ఉలిక్కిపడింది. ఈ దాడిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు కాగా, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమార్చారు.

తాజా ఘటనపై శివసేన (ఉద్ధవ్ వర్గం) అరవింద్ సావంత్ మాట్లాడుతూ ‘ఎవరికీ గాయాలు కాలేదు. వారు కిందకు దూకినప్పుడు వెనుక బెంచీలు ఖాళీగా ఉండడంతో పట్టుకున్నారు…ఇద్దరు మంత్రులు సభలో ఉన్నారు’ అని తెలిపారు. స‌భ జ‌రుగుతుండ‌గా అనూహ్యంగా 20 ఏండ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు వ్య‌క్తులు విజిట‌ర్స్ గ్యాల‌రీ నుంచి స‌భ‌లోకి దూకి ప‌సుపు రంగు గ్యాస్‌ను వ‌దిలార‌ని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చెప్పారు.వారు కొన్ని నినాదాలు చేశార‌ని, వారు వ‌దిలిన గ్యాస్ విష వాయువు కావ‌చ్చ‌ని, ఇది తీవ్ర భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌మ‌ని కార్తీ చిదంబ‌రం పేర్కొన్నారు. 2001లో డిసెంబ‌ర్ 13న పార్ల‌మెంట్‌పై దాడి జ‌ర‌గ్గా సరిగ్గా ఇదే రోజు ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌ర్హ‌నీయ‌మ‌ని, ఇది ముమ్మాటికీ భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌మేన‌ని కార్తీ చిదంబ‌రం వ్యాఖ్యానించారు.