2040 నాటికి చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామి

చంద్రయాన్-3 చరిత్రాత్మక విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రాజెక్టుకు సిద్ధమైంది. 2040 నాటికి చంద్రునిపైకి తొలిసారిగా భారత​ వ్యోమగామలను పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మిషన్ ​కోసం భారత్‌​కు చెందిన వ్యోమగాములను పంపించేందుకు సిద్ధం అవుతోందని ఇస్రో ఛైర్మన్​ సోమనాథ్ తెలిపారు. 
 
ఈ మేరకు మనోరమ ఇయర్ ​బుక్ 2024 వారికి ఇచ్చిన ఇంటర్య్యూలో పేర్కొన్నారు. 2040 నాటికి వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలన్న లక్ష్యంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నలుగురు పైలట్లను వ్యోమగాములుగా శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేసినట్టు ఇస్రో అధిపతి సోమనాథ్ వెల్లడించారు.  ప్రస్తుతం ఈ వ్యోమగాములు గగన్‌యాన్ మిషన్ కింద బెంగళూరులో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శిక్షణ పొందుతున్నట్లు సోమ్​నాథ్​ తెలిపారు.
భూమికి సమీపంగా ఉండే దిగువ కక్ష్యలోకి ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములను పంపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సోమనాథ్ వివరించారు.  అంతరిక్షంలో వారు మూడు రోజులు గడిపాక సురక్షితంగా భూమికి తిరిగి వస్తారని పేర్కొన్నారు. 2025 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్‌​ను ప్రారంభించాలని ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించారని సోమనాథ్ వివరించారు.
 
 ప్రపంచ అంతరిక్ష వేదికపై భారత ఉనికి మరింత పటిష్ఠం కావడానికి వీలుగా శుక్ర, అంగారక గ్రహాలపై అన్వేషణ ప్రారంభించాలని ప్రధాని మోదీ  లక్షాలను నిర్దేశించారని సోమనాథ్ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమం రానున్న సంవత్సరాల్లో ఉన్నత శిఖరాలకు చేరగలదని సోమనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
 
కాగా, గగన్‌యాన్ మిషన్‌లో వ్యోమగాములను సురక్షితంగా గగనంలోకి పంపగలిగే కీలకమైన సాంకేతిక వ్యవస్థ వ్యోమనౌక (హెచ్ ఎల్ వి ఎం3)లో ఉంది. ఈ ఆర్బిటల్ మోడ్యూల్‌లో క్రూ మోడ్యూల్(సిఎం)సర్వీస్ మోడ్యూల్ (ఎస్ఎం), ప్రాణాధార వ్యవస్థలు ఉన్నాయి. అయితే గగన్‌యాన్‌కు ముందు ఇస్రో ఎయిర్‌డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, వ్యోమనౌకపై ప్రయోగాలతోపాటు రెండు మానవ రహిత ప్రయోగాలు (జీ1, జీ 2) కూడా చేపట్టనుంది. 
 
ఈ దిశగా ఇప్పటికే టెస్ట్ వెహికల్ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించింది. అత్యవసర సమయాల్లో వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకోడానికి అవసరమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) ను పరీక్షించింది. టెస్ట్ వెహికల్ (టివి-డి1) యొక్క మొదటి డెవలప్‌మెంట్ ఫ్లైట్ అక్టోబరు 21, 2023న ప్రారంభించబడింది. ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ విమానంలో అబార్ట్‌ను విజయవంతంగా ప్రదర్శించింది. ఈ టెస్ట్ ఫ్లైట్ యొక్క విజయం తదుపరి మానవరహిత మిషన్లు, అంతిమ మానవ అంతరిక్ష మిషన్ 2025 లో ప్రారంభించబడుతుందని అంచనా వేస్తున్నామని సోమనాథ్ తెలిపారు.
 
ఇక‌, చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడం గురించి మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రాత్మక విజయమని, ఆగస్టు 23 (చంద్ర దక్షిణ ధ్రువం దగ్గర దిగడం)ని ‘భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించడానికి దారితీసిందని ఆయన పేర్కొన్నారు. ఇది అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సల్ఫర్, మాంగనీస్, సిలికాన్ మరియు చంద్రుని మట్టిలో ఆక్సిజన్‌లను కనుగొన్న విలువైన చంద్ర డేటాను అందించిందని సోమనాథ్ తెలిపారు.