సంజయ్ రౌత్‌పై దేశద్రోహం కేసు

తమ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాసం రాశారన్న ఆరోపణపై శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్‌పై యావత్మాల్ పోలీసులు దేశద్రోహంతోసహా ఇతర నేరాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.  ఈ వ్యాసంలో ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది.
 
యావత్మాల్ జిల్లా బిజెపి సమన్వయకర్త నితిన్ భూటడా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సామ్నా పత్రిక ఎగ్జిక్యుటివ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌పై యావత్మాల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. 
 
డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోదీపై సామ్నాలో సంజయ్ రౌత్ ఒక అభ్యంతరకర వ్యాసం రాశారని భూటడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఐపిసిలోని 124(ఎ), 153(ఎ), 505(2) సెక్షన్ల కింద సోమవారం సంజయ్ రౌత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆ అధికారి చెప్పారు. దర్యాప్తు జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో శివసేన అధికారిక పత్రిక సామ్నా వీక్లీ కాలమ్‌లో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ సంజయ్‌ రౌత్‌ ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రౌత్ వ్యాసంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.