క్రిమినల్‌ చట్టాల బిల్లులు ఉపసంహరణ.. కొత్త ముసాయిదా బిల్లు

క్రిమినల్‌ చట్టాలను మార్చే మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం ఉపసంహరించుకున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫారసులతో కూడిన కొత్త ముసాయిదా బిల్లులను ఆయన లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ నెల 14న బిల్లుల చర్చ జరుగుతుందని, 15న చర్చలో సమాధానాలు ఇవ్వనున్నట్లు అమిత్‌షా తెలిపారు. 
 
హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సిఫారసులను పొందుపరిచేందుకు అనేక సవరణలను తీసుకువచ్చేందుకు బదులుగా.. మార్పులను చేస్తూ కొత్త బిల్లులను తీసుకురావాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బిల్లులుపై గురువారం చర్చ ఉంటుందని.. శుక్రవారం ఓటింగ్‌ జరుగుతుందని అమిత్‌ షా విపక్ష సభ్యులకు పేర్కొన్నారు.

అయితే, మూడు బిల్లులను అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. దీనిపై షా స్పందిస్తూ ముసాయిదా చట్టాలను అధ్యయనం చేసేందుకు సభ్యులకు 48 గంటల సమయం ఉండేలా బిల్లులను మంగళవారం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 

ప్రధానంగా ఐదు విభాగాల్లో మార్పులు చేశామని, వ్యాకరణం, భాషకు సంబంధించిన మార్పులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ బిల్లు, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ మూడు బిల్లులను జాయింట్ కమిటీకి పంపాలన్న సూచనలను షా తిరస్కరించారు. స్టాండింగ్ కమిటీ అనేక సిఫార్సులు చేసిందని చెప్పారు. 

మూడు బిల్లులపై చర్చకు మొత్తం 12 గంటల సమయం ఇచ్చినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న బ్రిటిష్‌ కాలానికి చెందిన ఇండియన్ పీనల్ కోడ్-ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ చట్టాలను మార్చాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. 

వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యం చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. గత పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రం బిల్లును సభ ముందుకు తీసుకువచ్చింది. ఆ తర్వాత వాటిని పార్లమెంట్‌ కమిటీ పరిశీలనకు పంపింది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ఆయా బిల్లులను ఆమోదించాలని చూస్తున్నది. 

ఇందులో భాగంగా ఆయా బిల్లులను కేంద్రమంత్రి మంగళవారం సభలో ప్రవేశపెట్టారు. కొత్త చట్టాల్లో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. ఇందులో తీవ్రవాద నిర్వచనాన్ని సైతం మార్చింది. ఆర్ధిక అంశాల్లో జరిగే నేరాలను కూడా తీవ్రవాదంగా పరిగణిస్తూ మార్పు చేయగా.. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.