కేరళ గవర్నర్ పై దుండగుల దాడి.. సీఎంపై ఆరోపణలు

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ ఖాన్‌, ముఖ్యమంత్రి పునరాయి విజయన్ ల మధ్య సాగుతున్న వాదోపవాదాలు భౌతికపరమైన దాడుల వరకు చేరుతున్నాయి. గవర్నర్ వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించడం ఈ సందర్భంగా కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ పర్యటన నిమిత్తం తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఆగ్రహంతో కారు దిగిపోయిన గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనపై భౌతిక దాడి చేయించేందుకు ముఖ్యమంత్రి విజయన్‌ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. తన వాహనంపై కొందరు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు దాడి చేశారని మండిపడ్డారు. ఇది ముఖ్యమంత్రి చేయించిన పనేనని, వీరిని ఆయనే పంపారని ఆయన స్పష్టం చేశారు.

‘ముఖ్యమంత్రి కాన్వాయ్ కే ఇలాంటి సంఘటన ఎదురైతే సహిస్తారా? ముఖ్యమంత్రి కారు సమీపంలోకి ఎవరి కారునైనా రానిస్తారా? కానీ నా వాహనానికి మాత్రం ఆటంకాలు సృష్టించారు. నా కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొన్నారు. ముఖ్యమంత్రి నాతో విభేదించవచ్చు కానీ, ఇలా దాడికి పాల్పడటం భావ్యం కాదు’ అంటూ గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ ‘కేరళలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణ. రాజ్ భవన్ నుంచి విమానాశ్రయం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ గవర్నర్ ఐదు కిలోమీటర్లు ప్రయాణించేలోగా ఆయనపై రెండు సార్లు దాడి జరిగింది. దాడికి దిగినవారిని పోలీసులు వదిలేశారు’ అంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిపోతున్నట్లు కనిపిస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రెండు వైపుల నుంచి తన కారును ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చుట్టిముట్టారని తెలిపారు. యూనివర్సిటీల్లో నియామకాలపై గవర్నర్ తీరుకు నిరసనగా అధికార సీపీఎంకి చెందిన విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ కేరళ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో గవర్నర్ కారును అడ్డుకోవడంతో ఆయన ముఖ్యమంత్రిపై  ఆరోపణలు చేయడం గమనార్హం. అంతేకాదు, చాలాకాలంగా గవర్నర్, కేరళ సీఎంల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో వీరి మధ్య దూరం మరింత పెరిగింది.  కన్నూర్‌ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌‌గా గోపీనాథ్‌ రవీంద్రన్‌ పునర్నియామకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. 
 
ఈ విషయంలో కేరళ ప్రభుత్వం గవర్నర్ జోక్యాన్ని, రవీంద్రన్‌ను తిరిగి నియమిస్తూ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది. కోర్టు తీర్పుపై గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ స్పందిస్తూ రవీంద్రన్‌ను వీసీగా నియమించాలంటూ సీఎం పినరయి విజయన్‌ తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌. బిందును తప్పుపట్టడానికి కారణం లేదని వ్యాఖ్యానించారు.

దీనికి కౌంటర్‌గా గవర్నర్‌ ఆరిఫ్‌ తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ సీఎం విజయన్‌ ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది. గవర్నర్‌గా ఆయన తన విధులు నిర్వర్తిస్తే చాలని, ఆయన ఏదైనా చెప్పాలి అనుకుంటే నేరుగా తనకు చెప్పాలని సీఎం హితవు చెప్పారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తాజాగా చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు, తాము చేపట్టిన నవ కేరళ సదాస్ ర్యాలీపై సీపీఎం, డీవైఎఫ్ఐ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.

 
ఇలా ఉండగా, కేరళ గవర్నర్ పై ఎస్ఎఫ్ఐ భౌతిక దాడికి దిగడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విజయన్ వ్యూహాత్మక మద్దతుతోనే ఈ విధంగా జరిగి ఉంటుందని ఆయన ఆరోపించారు. వరుసగా, శనివారం, సోమవారం గవర్నర్ పై భౌతిక దాడికి ప్రయత్నం చేశారని, పోలీసులు మౌనంగా మద్దతు ఇచ్చారని పేర్కొంటూ ముఖ్యమంత్రి దాడి చేసిన వారికి మద్దతు ఇచ్చారని ఆయన ఆరోపించారు.