`సుప్రీం’ తీర్పు చరిత్రాత్మకం.. సమిష్టి సంకల్పానికి నిదర్శనం

 
* డా. కరణ్ సింగ్, ఉద్ధవ్‌ ఠాక్, నడ్డా హర్షం 

ఆర్టికల్ 370 రద్దుని సమర్థిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్‌ ప్రజల ఐక్యత, పురోగమనం, దృఢవిశ్వాసం కోసం సుప్రీంకోర్టు సుస్పష్టమైన ప్రకటన చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. 

ఆర్టికల్ 370 రద్దు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను త్రోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ‘‘ ఆర్టికల్ 370 రద్దుపై ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. 5 ఆగస్టు 2019న భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది’’ అని పోస్ట్ చేశారు.

2019 ఆగస్టు 5 వ తేదీన భారత పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించిందని ప్రధాని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌, లఢఖ్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న సోదరసోదరీమణుల ఆశలు, ఐక్యత, పురోగతిని ప్రతిధ్వనించే తీర్పు అని హర్షం వ్యక్తం చేశారు. భారతీయులుగా మనం ఎంతో గర్వపడే ఐక్యతను సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసిందని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌, లఢఖ్‌ ప్రజల కలలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు.

దృఢమైన విశ్వాసం కలిగిన జమ్మూ, కాశ్మీర్, లడఖ్‌ ప్రజల కలలను సాకారానికి నిబద్ధతతో ఉన్నామని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రగతి ఫలాలను సాధారణ ప్రజలతోపాటు సమాజంలో అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన సమాజానికి అభివృద్ధి ఫలాలను అందజేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు కాదని, ఇదొక ఒక ఆశాకిరణంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానమని, ఉమ్మడి భారతదేశాన్ని నిర్మించాలనే సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్, లఢఖ్ ప్రజల కలలు, ఆశలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మహారాజా హరిసింగ్ కుమారుడు డా. కరణ్ సింగ్ ఈ తీర్పును స్వాగతించారు. “ఏది జరిగినా రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందని ఇప్పుడు స్పష్టమైంది. రాష్ట్ర హోదాను త్వరగా పునరుద్ధరించాలని నేను ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నాను” అని తెలిపారు.

“జమ్మూకాశ్మీర్ లోని ఒక వర్గం ప్రజలు ఈ తీర్పుతో సంతోషంగా ఉండరు. నా హృదయపూర్వక సలహా ఏమిటంటే, వారు అనివార్యమైన వాటిని అంగీకరించాలి. ఇప్పుడు ఇది జరిగింది. సుప్రీంకోర్టు చర్యను సమర్థించింది. వారు అంగీకరించాలి. కాబట్టి అనవసరంగా వారి తలను గోడకు కొట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు నా సూచన ఏమిటంటే  వచ్చే ఎన్నికల్లో పోరాడేందుకు తమ శక్తియుక్తులను మళ్లించాలనేది నా సూచన. ప్రజలు ఇప్పుడు ఎలాంటి ప్రతికూలతలకు లోనుకాకుండా చైతన్యవంతం కావాలి ” అంటూ డా. కరణ్ సింగ్ ముస్లింలకు హితవు చెప్పారు. 

మరోవైపు.. ఆర్టికల్‌ 370 రద్దు పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పేదలు, అణగారిన వర్గాల హక్కులను పునరుద్ధరించగలిగామని స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో వేర్పాటువాదం, రాళ్ల దాడుల ఘటనలు ఇక గతమే అని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత నేడు మరింత బలపడిందని అమిత్ షా తెలిపారు. 

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా జమ్మూ కాశ్మీర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ సర్కారు ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు.

“ఆర్టికల్ 370కి సంబంధించి గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. సెక్షన్ 370,  35ఎ, దాని ప్రక్రియను తొలగిస్తూ ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. లక్ష్యం. గౌరవనీయులైన ప్రధాన మంత్రి @narendramodi ji ప్రభుత్వం జమ్మూ, కాశ్మీర్‌ను దేశంలోని ప్రధాన భావజాలంలో చేర్చే చారిత్రాత్మక పనిని చేసింది, దీనికి నేను, మన కోట్లాది మంది కార్యకర్తలు ప్రధానమంత్రికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అంటూ నడ్డా ప్రకటించారు.

ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతకంటే ముందే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలని సూచించారు. 

అయితే ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సుప్రీం ఇచ్చిన తీర్పుపై జమ్మూ కాశ్మీర్‌లోని ప్రాంతీయ పార్టీలైన ఆజాద్ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పెదవి విరిచాయి. ఈ తీర్పు విచారకరమని, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు సంతోషంగా లేరని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం గులామ్‌ నబీ ఆజాద్‌ చెప్పారు. 

అయినప్పటికీ సుప్రీం ఇచ్చిన తీర్పును మనం అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. ఈ తీర్పుతో అసంతృప్తిగా ఉన్నామని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. అయినా దీంతో తాము నిరుత్సాహపడట్లేదని చెప్పారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి బీజేపీకి కొన్ని దశాబ్దాలు పట్టిందని, తాము కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధం అవుతున్నామని, తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.