జార్ఖండ్‌ సీఎం సోరెన్‌కు ఆరోసారి ఈడీ నోటీసులు

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు  వ్యవహారంలో మనీ లాండరింగ్‌ జరిగిందని పీఎంఎల్‌ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు డిసెంబర్‌ 12న తమ ముందుకు రావాలని తాఖీదులచ్చింది.
రాంచీలో భూముల క్రయవిక్రయాలు, కొనుగోలు మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి, ఫెడరల్ ఏజెన్సీ ముందు విచారణకు హాజరు కావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరో సారి సమన్లు ​​పంపింది. దీంతో హేమంత్ సోరెన్‌ మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి.
 
 “ముఖ్యమంత్రి మంగళవారం రాంచీలోని ఏజెన్సీ జోనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది” అని ఒక అధికారి తెలిపారు. గతంలో ఇదే కేసు విషయంలో ఆయనకు ఈడీ ఐదోసారి నోటీసులు పంపించింది.  ఈ నోటీసులను వ్యతిరేకిస్తూ సోరెన్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో మొదట ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. కాగా అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా సోరెన్ ఉన్నారు. ఇక తాజాగా ఈడీ ఇచ్చిన నోటీసులను హేమంత్ సోరెన్ ఇంకా సవాలు చేయలేదు.
అయితే ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని విచారణ సంస్థ అరెస్టు చేసింది.  వారిలో 2011 బ్యాచుకు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఛవీ రంజన్‌ కూడా ఉన్నారు. ఆయన సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషన్‌గా పనిచేశారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో సోరెన్‌ను గతేడాది నవంబర్‌లో ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.